సమాచార శాఖలో స్కాంల కలకలం.. సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్ 

తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ అవినీతి అడ్డాగా మారిందా? ప్రకటనల పేరుతో ప్రభుత్వ నిధులు దోచెస్తున్నారా? ఐఅండ్ పీఆర్ లో అవినీతి జరుగుతుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. సమాచార పౌర సంబంధాల శాఖలో భారీ కుంభకోణాలు వెలుగు చూశాయి. రూ,11.75 కోట్ల స్కాం జరిగిందని తేలింది. 2015-17 మధ్య రెండు ఏండ్లకు సంబంధించి ప్రకటనల పేరుతో ఈ డబ్బులను దిగమింగారు. ఓ అంతర్జాతీయ మార్కెటింగ్‌ అనుబంధ సంస్థ సీఈవో, తెలంగాణ సమాచార శాఖ అధికారులు కలిసి రెండు కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అవినీతి  గుట్టు బయటపడడంతో లండన్‌ సంస్థ హైదరాబాద్‌లోని అనుబంధ సంస్థను మూసేసి.. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌కు ‘ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీ) కింద జరిమానా చెల్లించుకుంటోంది. 

డబ్ల్యూపీపీ కంపెనీ 2011 జూలై 6న తన అనుబంధ సంస్థ అయిన జేడబ్ల్యూటీ ఇండియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన మైండ్‌సెట్‌ అడ్వర్టయిజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను టేకోవర్‌ చేసింది. తర్వాత జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ అడ్వర్టయిజింగ్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సంస్ ప్రభుత్వానికి యాడ్స్‌ తయారుచేసేది. అయితే వాటిని తాను నేరుగా మీడియాకు ఇవ్వకుండా.. ఆ బాధ్యతను ‘వెండర్‌ ఏ’ అనే బినామీ సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థ .. మీడియా నుంచి యాడ్‌ స్పేస్‌ను కొనుగోలు చేసి యాడ్స్‌ ఇచ్చేది. సదరు యాడ్స్‌కు సంబంధించిన బిల్లులను ‘వెండర్‌ ఏ’ సంస్థ.. ఆయా మీడియా సంస్థల నుంచి తీసుకుని జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌కు ఇచ్చేది. అందులో 10 శాతం కమీషన్‌ వెండర్‌ ఏ సంస్థకు ముడుతుంది. కానీ మీడియా సంస్థలు ఇచ్చే బిల్లులేవీ తీసుకోకుండానే, చూడకుండానే జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సంస్థ వెండర్‌ ఏ కంపెనీకి చెల్లింపులు జరిపేసింది.

ఇలానే కాదు అసలు వాణిజ్యప్రకటనలే ఇవ్వకుండా డబ్బులు మింగేస్తూ మరో కుంభకోణానికి పాల్పడింది జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌. వెండర్‌ బి’ అనే మరో బినామీ కంపెనీని ఇందుకు వాడుకున్నాయి. 2015 జూన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలకు సంబంధించి ప్రచారైల కాంట్రాక్టు విలువ 15,88,480 డాలర్లు. అంటే దాదాపుగా రూ.11.75 కోట్లు. అయితే ఒక్క యాడ్‌ కూడా ఇవ్వకుండానే మొత్తం సొమ్ము మింగేశారు. పథకం ప్రకారం.. కాంట్రాక్టు అమలుచేసినట్లుగా ‘వెండర్‌ బి’ సంస్థ బోగస్‌ బిల్లులు సృష్టించింది. అలా మింగేసిన రూ.11.75 కోట్లలో రూ.7.5 కోట్లు డీఐపీఆర్‌ అధికారుల వాటాగా చేరినట్లు జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌  తయారుచేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. మిగిలిన సొమ్మును ‘వెండర్‌ బి’ సంస్థ జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సీఈవోకు నగదు రూపంలో ఇచ్చింది.  ఈ కుంభకోణాలకు సంబంధించి డీఐపీఆర్‌లోని అవినీతి అధికారికి, హైదరాబాద్‌లోని డబ్ల్యూపీపీ సీఈవోకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని డెలాయిట్‌ తేల్చినట్టు సమాచారం. డీఐపీఆర్‌ అధికారి పెద్ద లంచగొండి అని పేర్కొన్నట్టు తెలుస్తోంది.  

2015-17 కాలంలో  తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పని చేశారు. ఆయన హయంలోనే ఈ అడ్డగోలు అవినీతి జరిగింది. అంతర్జాతీయ సంస్థ ద్వారా రూ. 11.75 లక్షల రూపాయల అవినీతి జరిగిందని తేలినా.. ఇతరత్రా మార్గాల్లో భారీగానే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. సమాచార శాఖలో గత ఏడేండ్లుగా సాగిన కార్యాకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపించే దర్యాప్తులో నిజాలు తేలవని, సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ , టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. 

సమాచార పౌరసంబంధాల శాఖలో వెలుగుచూసిన స్కాంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన  కథనాన్ని జతచేస్తూ సోషల్ మీడియాలో ఆమె సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘ఏ దోపిడీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ఎంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో... ఆ పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలు, ఆత్మార్పణలకు ఏ మాత్రం విలువ లేకుండా ఉమ్మడిరాష్ట్ర కాలపు అక్రమాల పరంపరను నేటి తెలంగాణ పాలకులు జంకూ గొంకూ లేకుండా కొనసాగించారనడానికి మరో తిరుగులేని సాక్ష్యాన్ని మీడియా బయటపెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా గడవకముందే 2015 నుంచి రెండేళ్ళ పాటు I&PR (సమాచార ప్రజా సంబంధాల) విభాగంలో కొనసాగిన అవినీతి వారసత్వం బట్టబయలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరు చెప్పి... విదేశీ అడ్వర్టయిజింగ్ కంపెనీ WPP భారతీయ విభాగాల (JWT Mindset Advt.)తో కుమ్మక్కై వీసమెత్తు ప్రచారం కూడా చెయ్యకుండా అందరూ కలసి మొత్తంగా సుమారు రూ.12 కోట్లు... పత్రికల్లో యాడ్స్ అంటూ మరి కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు ఈ కథనం ఆధారాలతో సహా వివరాలిచ్చింది. ఈ సొమ్ములో రూ.7.5 కోట్లు డీఐపీఆర్ అధికారుల వాటాగా ఇచ్చినట్లు JWT Mindset నివేదిక ద్వారా తెలిసింది. కలకలం రేపుతున్న మరో విషయం ఏమిటంటే, ఈ డబ్ల్యూపీపీ సంస్థ పలు దేశాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడినప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రధానంగా తెలంగాణలోనే అవినీతికి పాల్పడినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పాలకులకు సంబంధం లేదంటే పసిపిల్లలు కూడా నమ్మరు. తెలంగాణలో పాలనా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ అధికార పార్టీ వారి అవినీతి, అక్రమాల చిట్టా పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఇలా ఏర్పడిందో లేదో... ఆ మరు క్షణం నుంచే అవినీతి మెట్లెక్కుతూ... అక్రమాల పుట్టలు కడుతూ ప్రజల్ని మోసగించిన వైనం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.’’ అంటూ విజయశాంతి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.