యడ్డీ కథ అడ్డం తిరిగింది.. బొమ్మై సినిమా భళేగా ఉంది! 

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై,మంత్రి వర్గాన్ని పునః వ్యవస్థీకరించారు. కొత్త మంత్రిమండలిలో 29 మందికి స్థానం కల్పించారు. పాత కొత్తల కలియికగా తీర్చి దిద్దిన నూతన మంత్రి మండలిలో, తాజా మాజీ ముఖ్యమత్రి యడ్యూరప్ప సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. ఎనిమిది మంది లిగాయత్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పిచారు. అలాగే, ఇతర సామాజిక సమీకరణల విషయంలోనూ సమతూకం పాటించారు. అయితే, యడ్యూరప్ప ఆశల మీద మాత్రం చల్ల చల్లని కూల్ కూల్ వాటర్  కుమ్మరించారు. 

రాజకీయ టక్కు టమార విద్యలలో ఆరితేరిన యడ్యూరప్ప, తన ముఖ్యమంత్రి పీఠం కదిలినా, కుమారుడు విజయేంద్రకు కీలక శాఖలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని ఆశించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి సంగతి దేవుడికెరుక, విజేంద్రకు  అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పోస్టునే పీకి పారేసిన ముఖ్యమంత్రి బొమ్మై, విజయేంద్ర విషయంలో తన పాత్ర ప్రమేయం లేదని, యడ్యూరప్ప, విజయేంద్రతో చర్చలు జరిపిన తర్వాతనే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని చేతులు దులుపుకున్నారు. 

నిజానికి, యడ్యూరప్పకు పార్టీలో ఏమి జరుగుతోంది, పార్టీ అధినాయకత్వం ఏమి ఆశిస్తోంది, అనేది తెలియదని అనుకోలేము. అంతే కాదు, పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరించే పరిస్థితి లేదని కూడా ఆయనకు తెలియంది కాదు. అయినా. ప్రజల్లో, ముఖ్యంగా తమ వర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలలో తమ ఇమేజిని నిలుపుకునేందుకు ఆయన ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర రాజకీయ భవిష్యత్తుకు పటిష్ట పునాదులు ఏర్పరిచేందుకు, ఆయన తాపత్రయ పడుతున్నారని, అందుకే గోడ మీద బోమం క్లియర్ గా ఉన్నా, ఏమీ తెలియనట్లు నటిస్తుననారని ఆయన వర్గం  నేతలే గుసగుసలు పోతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? రాష్ట్ర, పార్టీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది, చూడవలసి వుంది. 

ప్రస్తుతానికి అయితే, యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయేంద్ర, అయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏమీ లేదని, ఆయన సన్నిహిత వర్గాలే అంగీకరిస్తున్నాయి. యడ్డీ విషయంలో పార్టీ అధినాయకత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని అంటున్నారు. ప్రధానంగా రెండు విషయాల్లో పార్టీ అధినాయకత్వం యడ్డీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.రాష్ట్రంలో  బీజేపీ పాలక పక్ష హోదాను పొందడంలో యడ్డీ కష్టాన్ని గుర్తిస్తూనే, ఇక ఆయన పార్టీ నియమావళిని పాటించి  క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని, అదే సమయంలో పార్టీ మీద కుటుంబ రాజకీయాల ముద్ర పడకుండా చూడవలసిన బాధ్యత  కూడా ఆయనపైనే ఉందని అధినాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. యడ్యూరప్ప ఇకనైనా, తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలే హితవు చెపుతున్నారు. 

మంత్రి మండలి పునః వ్యవస్థీకరణ యడ్డీ వర్గంలో అసంతృప్తిని నింపింది అనేది మాత్రం కాదన లేని నిజం. యడ్యూరప్ప తనకు అత్యంత ఆప్తుడు అయిన బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయితే, తన మాట వేదం వాక్కుగా చెల్లుబాటు అవుతుందని ఆశించారు, కానీ బొమ్మై , యూ టూ బ్రూటస్,అవతారం దాల్చారు. అధిష్టానాన్ని అడ్డుపెట్టుకుని యడ్డీ ఆశలకు, ఆలోచనలకూ ఎక్కడికక్కడ గండి కొడుతున్నారు. దీంతో, ఒక్క యడ్డీనే కాదు, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా, నిరాశకు గురయ్యారు. అయితే, ఈ అసంతృప్తి ఇప్పటికిప్పుడు అసమ్మతిగా రూపాంతరం చెందుతుందా, అంటే, ఇప్పటికిప్పుడు అసమ్మతి విచ్చుకునే అవకాశం లేదని అంటున్నారు.  పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి బొమ్మై ఈ సున్నిత సమస్యను ఎలా ట్యాకిల్ చేస్తారనే దానిపైనే భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.