జనసేనలో వైసీపీ స్లీపర్ సెల్స్!
posted on Oct 20, 2023 6:56AM
ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ వైనాట్ 175 అన్న అధికార పార్టీలో ఇప్పుడు బ్రతుకు జీవుడా అనే భావన కనిపిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర, తెలుగుదేశం అధినేత చంద్రబాబు యాత్రలతో తెలుగుదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడే జోష్ కనిపిస్తుండగా.. అకస్మాత్తుగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓ రెండు మూడు రోజులు మహా అయితే వారంలో చంద్రబాబు బయటకి వస్తారనుకోగా నెల గడిచినా వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు జైలు పాలైతే తెలుగుదేశంను దెబ్బతీయొచ్చని వైసీపీ భావించగా.. తెలుగుదేశం ఇప్పుడు అంతకు మించిన బలంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు ఒకే చెప్పి సమరశంఖం పూరించడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలలో తెలుగుదేశంకు బలం పెరగడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది.
నిజానికి తెలుగుదేశం, జనసేన పొత్తును వైసీపీ తొలి నుండి జీర్ణించుకోలేకపోతోంది. రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందన్నది వైసీపీ భావన. అందుకోసమే ఈ పొత్తును చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. తెలుగుదేశంకు బీ టీమ్ జనసేన, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే పని చేశారు. కానీ, పవన్ నా పార్టీ నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మాటలతో పని కాకపోవడంతో వైసీపీ కుట్ర పూరితంగా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టార్గెట్ గా వైసీపీ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కుట్ర పన్ని జనసేన పార్టీకి భారీ నష్టం చేకూరేలా అమలు పరుస్తున్నట్లు చెప్తున్నారు.
సాధారణంగా టెర్రరిజంలో స్లీపర్ సెల్స్ అని ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు సామాన్య ప్రజలలో కలిసిపోయి తీవ్రవాదుల కోసం పనిచేస్తుంటారు. అవసరమైన సమయంలో వీళ్ళు ఆత్మహుతి దాడులకు సిద్దపడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటారు. తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే వీరికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసీపీ జనసేనపై ఇదే తరహా కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కొందరు వైసీపీ సానుభూతి పరులైన నేతలను ముందుగా జనసేనలోకి పంపించి.. అవసరమైనప్పుడు వారిని జనసేనలో రెబల్స్ గా తెరపైకి తెస్తారు. ముందుముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి మిగతా నాయకులలో అభద్రతా భావం కలిగిచడం, తద్వారా రాజకీయ శూన్యత సృష్టించి తెలుగుదేశంతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అలా చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ వ్యూహం రూపొందిందని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై పవన్ ప్రకటన అనంతరం జనసేనలో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మీడియాకి ఎక్కి పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. మరి కొందరు వారిని సమర్ధిస్తూ పార్టీలోనే కొనసాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టిసారించిన జనసేన నాయకత్వం.. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. అయితే, ముందు ముందు సీట్ల సర్దుబాటు సమయంలో వీళ్ళు మరోసారి రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక, వీళ్ళని ముందుగానే గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే జనసేనకు, తద్వారా జనసేన, తెలుగుదేశం కూటమికి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.