జ‌గ‌న్ తీరు.. వైసీపీ బేజారు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ అనాలోచిత‌ నిర్ణ‌యాలు ఆ పార్టీ శ్రేణుల‌ను ఆందోళనకు గురి చేయడమే కాదు, ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది వైసీపీ నేత‌ల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. ఓ అప‌రిచితుడిలా జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నేత‌ల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెప్పినా వినే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌ది కాదు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అధికారంలో ఉండ‌టంతో ఆయ‌న ఆడింది ఆట‌ పాడింది పాట అన్నట్లుగా సాగింది. ప్ర‌స్తుతం జగన్ అధికారంలో లేరు. ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా ప్రభుత్వాన్నీ, పార్టీనీ నడిపిన జగన్ ఇప్పుడు రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ విషయాన్నివైసీపీ నేతలో స్వయంగా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. జగన్ తీరు పట్ల  ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు అన్ని పార్టీల నేత‌లను చెడామాడా తిట్టేసిన నేతల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది‌. వ్యూహాల్లేకుండా, అడ్డగోలు నిర్ణయాలతో  త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును జగన్ నాశనం చేస్తున్నారని ప‌లువురు వైసీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జగన్ తీరుతో విసుగు చెంది పలువురు ఇఫ్పటికే పార్టీని వీడారు. మరి కొందరు వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.  అయినా జ‌గ‌న్ డోంట్ కేర్ అంటూ పేర్కొంటుండ‌టం పార్టీలో మిగిలిన నేతలు, శ్రేణుల్లో మ‌రింత ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. 

జ‌గ‌న్  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు చేయ‌డం ఏమాత్రం తెలియ‌ద‌ని వైసీపీ నేత‌లు బాహాటంగానే అంటున్నారు. రాజ‌కీయాల్లో అవ‌స‌ర‌మైన చోట త‌గ్గాలి.. ఆధిప‌త్యం చెలాయించాల్సిన‌ చోట ప‌ట్టువిడ‌వ‌కుండా పోరాడాలి.. అదే స‌మ‌యంలో త‌మ‌ను న‌మ్ముకున్న వారికి ర‌క్ష‌ణ‌గా ఉండాలి. కానీ, జ‌గ‌న్  మాత్రం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో తాను చెప్పిందే చేయాలి అన్న‌ట్లుగా పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు ఇస్తున్నారు‌. గ‌త ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండ‌టంతో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు విన్న వైసీపీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షంలోనూ జ‌గ‌న్ అదే వ్య‌వ‌హార‌శైలితో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్ధుల నియోజ‌క‌వ‌ర్గాలు మార్చ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌కు వైసీపీ సీనియ‌ర్ నేతలు ప‌దేప‌దే సూచించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం నియోక‌వ‌ర్గాల అభ్యర్థులను ఇష్టారీతిగా మార్చేశారు.  ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మికి అదికూడా ఓ కార‌ణం. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఓ ఆరు నెల‌ల స‌మ‌యం ఇద్దామ‌ని, ఆ త‌రువాత వారి ప‌నితీరులో లోపాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చేసిన సూచనలను జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా  చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్షణం  నుంచే విమ‌ర్శ‌లు చేయ‌డంతో జనంలో జగన్ పట్ల, వైసీపీ పట్లా ఉన్న వ్యతిరేకత మరింత ఎక్కువైందని వైసీపీ నేతలే అంటున్నారు.  

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు ఆ పార్టీ నేత‌ల‌కే ఆగ్ర‌హాన్ని తెప్పించింది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌వారికి స‌హాయం చేయాల్సిందిపోయి అధికారంలోకి కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌గ‌న్ రాజ‌కీయ అజ్ణానానికి నిద‌ర్శ‌మ‌న్న భావన వైసీపీలోనే వ్యక్తమైంది.   వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆ ప్రాంతంలో జ‌గ‌న్ నామ‌మాత్రంగా ప‌ర్య‌టించారు.. అలాకాకుండా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి ఆర్ధిక స‌హామ‌యో, ఇత‌ర రూపాల్లో స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తే బాగుండేది. కానీ, జ‌గ‌న్ మాత్రం అలాంటి ప‌నులేమీ చేయ‌కుండా త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వంపై బుద‌ర‌జ‌ల్లే ప్ర‌య‌త్నానికే ప్రాధాన్య‌త‌నిచ్చాడు. దీనికితోడు వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక స‌హాయం విష‌యంలోనూ జ‌గ‌న్, అనుకూల మీడియా అస‌త్య‌ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమైందని అంటున్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించిన స‌మ‌యంలో ఈవీఎంలు బెస్ట్ అని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఈవీఎంల వ‌ల్ల‌నే ఓడిపోయామ‌ని చెబుతుండ‌టంతో ఆయ‌న‌లో రాజ‌కీయ అవ‌గాహ‌నలేమిని స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్నద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు. 

హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు ఈవీఎంల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. ఏపీలోనూ అదే ప‌ద్ద‌తిలో జ‌రిగింద‌ని చెబుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతికే మొగ్గు చూపాలని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. అయితే 2019లో మాత్రం ఈవీఎంలను స‌మ‌ర్ధించిన జ‌గ‌న్‌.. ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హ‌రియాణా ఎన్నిక‌ల్లో ఈవీఎంల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టంతో ఆయ‌న ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు చూస్తున్నారా అన్న చ‌ర్చ మొదలైంది. ఇప్ప‌టికే ఎన్డీయేలో జగన్ కు స్థానం లేకుండా పోయింది. బీజేపీ కూడా గతంలో జగన్ పట్ల ఉన్న సానుకూలత కనబరచడం లేదు. ఇక  ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆయన సొంత చెల్లెలు షర్మిల మొదట్లోనే గండి కొడుతున్నారు.  దీంతో రెండింటికి చెడ్డ రేవ‌డిలా జగన్, వైసీపీ ప‌రిస్థితి ఉంది.  జ‌గ‌న్ తీరులో మార్పురాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.