బరితెగించిన వైసీపీ.. మీడియా సమావేశంలో ఉన్న అనితకు బెదరింపు కాల్

 వైసీపీ బరితెగించేసింది. ఒక సమావేశంలో  మాట్లాడుతుండగానే  తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనితకు బెదరింపు కాల్ వచ్చింది.మంగళవారం (ఆగస్టు 9)న  విజయవాడలో  మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అనిత హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతుండగానే అనితకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎత్తిన అనితకు గోరంట్ల మాధవ్ విషయంలో ఎక్కువ మాట్లాడవద్దంటూ బెదరింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె కూడా తాను వాస్తవాలనే చెబుతున్నానని సమాధానం ఇచ్చారు.

అంతే కాకుండా  ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఆ బెదరింపులను అందరికీ వినిపించారు. తనకు 9848075369 నంబర్ నుంచి కాల్ వచ్చింది. ట్రూకాల్ ఆధారంగా ఆ వ్యక్తి పేరు జి. మద్దిలేటి అన తెలిసిందన్నారు. ఆ వ్యక్తి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడవద్దంటూ బెదరించాడు. అంతే కాకుండా మాధవ్ నిప్పు అని వ్యాఖ్యానించాడు. ఇష్టారీతిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.

కాగా ఒక సమావేశంలో ఉండగానే తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనితకు బెదరింపు కాల్ రావడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు.   వంగలపూడి అనిత  సమావేశంలో ఉండగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంలో స్పందించవద్దంటూ ఓ వైసీపీ నేత ఫోనులో ఆమెను బెదిరించాడని చంద్రబాబు ఆరోపించారు. వాళ్ల ఎంపీ చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చడానికి వైసీపీ పెద్దలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో దీనిని బట్టే అర్థమవుతోందని పేర్కొన్నారు. వారెంతగా బరితెగించారో బెదరింపు ఫోన్ కాల్ ను బట్టి అవగతమౌతుందని చంద్రబాాబు అన్నారు.

ప్రభుత్వ దారుణాలపై, వైసీపీ నేతల అకృత్యాలపై మాట్లాడకూడదంటూ బెదరించడం హక్కులను హరించడమేనని ఆయన అన్నారు. అనితకు బెదరింపు కాల్ ను తాము ఖండిస్తున్నామనీ, ఒక మహిళా నేతకే ఇలా బెదరింపులు వస్తున్నాయంటే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని అన్నారు. దీనిపై పోలీసులు చర్య తీసుకోరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి ఆదేశాలు వచ్చేంతవరకు అన్నింటినీ చూస్తూ కూర్చోవడమే పోలీసుల పని అన్నట్టుగా తయారైందని విమర్శించారు.