అచ్చెన్నాయుడి ఎన్నిక చెల్లదట...కోర్టులో పిటిషన్ !
posted on Jul 9, 2019 9:14AM

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చాలాచోట్ల వైసీపీ అభ్యర్థులు వారి ఎన్నిక చెల్లదంటూ పిటిషన్ లు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కొందరు కేసుల గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించని నేపధ్యంలో అలాగే మరికొందరు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అలా ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. ఏపీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అయితే, ఆయన నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడ్‌విట్ లో తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించలేదంటూ అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన పేరాడ తిలక్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
జులై 21, 2017లో అచ్చెన్నాయుడిపై అనంతపురం జిల్లా హీరేహళ్ లో కేసు నమోదయ్యిందని, అందులో ఆయన 21 నిందితుడిగా ఉన్నారని తిలక్ తన పిటిషన్‌లో పేర్కన్నారు. ఈ కేసు వివరాల్ని ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రంలో వెల్లడించకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారని అయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ కేసులో రాయదుర్గం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని ఆ తర్వాత ఈ కేసు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యిందని, నామినేషన్ వేసే సమయానికి అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆయన పేర్కోన్నారు.
కేవలం టెక్కలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే అఫిడ్‌విట్‌లో ప్రస్తావించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయాలని, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని తిలక్ తన పిటిషన్ లో కోరారు.