ఆర్డినెన్స్ కూడా ఇవ్వలేరా? యనమల కీలక కామెంట్స్

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలనే దానిపై జగన్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని పట్టుదలగా ముందుకెళ్లిన వైసీపీ ప్రభుత్వానికి కౌన్సిల్ లో చుక్కెదురు కావడంతో నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మూడు రాజధానుల బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై మంతనాలు జరిపారు. పార్టీ ముఖ్యనేతలతోపాటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అలాగే, హైకోర్టులో పెద్దఎత్తున దాఖలైన పిటిషన్లపైనా ప్రభుత్వ వాదనలు ఎలా ఉండాలన్నదానిపై ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీతో చర్చించారు.

అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలే కాదు... కొన్నేళ్లు కూడా పట్టొచ్చని కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలే అయినా... అవసరమైతే పొడిగించవచ్చని అన్నారు. సెలెక్ట్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందని యనమల గుర్తుచేశారు. ఈ ప్రక్రియకు ఒక్కోసారి ఏళ్లు కూడా పడతాయన్నారు. అంతేకాదు, బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి కూడా వీలు ఉండదని యనమల అన్నారు. అసలు మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదన్నారు. మరోవైపు ఆర్డినెన్సులను గతంలో రాష్ట్రపతి తిరస్కరించారని, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా కోర్టులో నిలబడదని యనమల అభిప్రాయపడ్డారు. అలాగే, రూల్ 154 కింద మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు కూడా ప్రశ్నించలేవని యనమల అన్నారు.