తెలంగాణ తిరుమల యాదాద్రి ఉన్నా.. అందరి బాటా తిరుమలేనా?

కేసీఆర్ జ‌మానాలో వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసి  యాదాద్రిని భూత‌ల వైకుంఠ‌మా అన్న‌ట్టుగా  తీర్చి దిద్దారు. అదేం వింతో- విడ్డూర‌మో- విచిత్ర‌మో.. తెలంగాణ‌ సీఎం రేవంత్ ద‌గ్గ‌ర్నుంచి మొద‌లు పెడితే, బీఆర్ఎస్ నాయకులు  స‌హా అందరూ ముక్కోటి సంద‌ర్భంగా తిరుమ‌ల బాట ప‌ట్టారు.. కార‌ణ‌మేంటి? అంటే తిరుమ‌ల‌వెంక‌న్న‌క‌న్నా మించిన క‌లియుగ దైవం లేద‌నా?  లేక యాదాద్రి ప్రముఖ్యతను గుర్తించడం లేదా అన్న చర్చకు తెరలేచింది.  

వాస్తవానికి తిరుమ‌ల ఈ స్థాయిలో ఉండ‌టానికి ఇక్క‌డి  పూజారి  వ్య‌వ‌స్థ ఎంతో ముఖ్య‌ కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమ‌ల‌ను మిగిలిన ఏ ఆల‌యం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు.  ఎవ‌రైతే ఆ ఆల‌యంలో సాక్షాత్ వైకుంఠంలో జ‌రిగిన‌ట్టే అన్ని పూజాదికాల‌ను జ‌రుపుతారో ఆ ఆల‌యం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమ‌ల ఆల‌యం కన్నా పెద్ద ఆల‌యాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమ‌లకే కాదు ఏకంగా, వైష్ణ‌వ మ‌తానికే కేంద్ర కార్యాల‌యం. కానీ, తిరుమ‌ల శ్రీరంగం, తిరువ‌నంత‌పురం ప‌ద్మ‌నాభ స్వామి వారి ఆల‌యాల‌కు మించిన ప్రాభ‌వాన్ని,  వైభ‌వాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కార‌ణం ఇక్క‌డ జ‌రిగే క్ర‌తువులు అన్నీ ఆగ‌మ శాస్త్ర బ‌ద్ధంగా ఉంటాయి.

ఇక తిరుమ‌ల  శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఎలా వ‌చ్చిందో చూస్తే.. అప్ప‌ట్లో అంటే..  14వ శ‌తాబ్దంలో తురుష్కులు.. శ్రీరంగంపై దండెత్తుతున్నార‌ని తెలిసి అక్క‌డి దేవ‌తా  విగ్ర‌హాల‌న్నిటినీ తిరుమ‌లకు త‌ర‌లించి.. ఇక్క‌డి  నుంచే  రంగ‌నాథుడికి నిత్య కైంక‌ర్యాల‌ను సాగించేవారు. అందులో భాగంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం వంటి ఏర్పాట్లు శ్రీనివాసుడి  స‌మ‌క్షంలో జ‌ర‌ప‌డం మొద‌లైంది. అందుకే ఇక్క‌డ తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో  ఉన్న రంగ‌నాథ మండ‌పం   ఆనాటి రంగ‌నాథుడు తిరుమ‌ల‌లో ఉన్నాడ‌ని చెప్ప‌డానికి గుర్తుగా నిలుస్తుంది. అయితే, త‌ర్వాతి  కాలంలో రంగ‌నాథుడు తిరిగి శ్రీరంగం వెళ్లిపోయినా.. ఇక్క‌డ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఒక ఆచారంగా నిలిచిపోయింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం అన్ని వైష్ణ‌వాల‌యాల్లో ఒక ఆన‌వాయితీగా వ‌చ్చింది.

అందులో భాగంగా యాదాద్రి ల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారి ఆల‌యంలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అయినా తెలంగాణ తిరుమ‌ల అయిన యాదాద్రి కంటే.  రాష్ట్ర నాయకులు, వీరిలో ఆంధ్ర ఆధిపత్యం అంటూ నిత్యం విమర్శలు గుప్పించేవారు కూడా తెలంగాణ తిరుమల కంటే తిరుమల వెంకన్న దర్శనమే మిన్న అన్నట్లుగా తిరుమల బాటే పడుతుంటారు. తిరుమలలో తెలంగాణ పొలిటీషియన్లకూ ప్రొటోకాల్ కావాలంటూ తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తుతుంటారు. కానీ తెలంగాణ తిరుమల అయిన యాదాద్రిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu