వైనాట్ పరార్? వైసీపీ కొత్త నినాదం

వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు పంపిన జగన్ కు వైనాట్ 175 నినాదం ఎంత హాస్యాస్పదంగా ఉందో అప్పుడే తెలిసిపోయింది.

గడపగడపకూ నిరసన సెగలను ఎదుర్కొన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఆ తరువాత గడపగడపకు కార్యక్రమాన్ని ఎలాగోలా మమ అనిపించేశారు. ఆ తరువాత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై జగన్ దృష్టి పడింది. దీంతో ఆయన మరో నినాదం ఇచ్చారు. అదే వైనాట్ కుప్పం. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించి.. ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు పెద్ద తాయిలం ఇస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే వారు మాత్రం భరత్ ను గెలిపిస్తే మంత్రి మాత్రమే ఔతారు.. అదే చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా? అని ఎగతాళి చేశారు. సరే వైనాట్ కుప్పం నినాదం కూడా విఫలమయ్యాకా.. ఇక జగన్ తో పని లేకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలే కొత్త నినాదాన్ని అందుకున్నారు.

అదే వైనాట్ పరారీ. అని. ఆ నినాదాన్ని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కూడా అయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆచరించి చూపారు. అది ఆయనకు సత్ఫలితాన్నే ఇచ్చింది. అరెస్టును తప్పించుకోగలిగారు. ముందస్తు బెయిలూ పొందగలిగారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంతి ఆ నినాదాన్నే ఇప్పుడు నమ్ముకున్నారు. ఒక వేళ ఏదైనా తేడా కొడితే వైనాట్ పరార్ అనడానికి సిద్ధంగా ఉన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికలు అయిన తరువాత వైసీపీ నేతలకు వాస్తవం బోధపడింది. గెలుపు ఆశలు ఇసుమంతైనా లేవన్నవిషయం ధృవపడింది. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా రెచ్చిపోయి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు పరార్ మంత్రాన్ని పఠించడానికి రెడీ అయిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే పెద్దగా వినిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు అజ్ణాతంలోకి వెడుతున్న సంఘటనలు కానీ, వార్తలు కానీ వినిపించడం లేదు కానీ,  వైసీపీ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు దేశ విడిచిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచించుకుంటున్నారనీ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కౌంటింగ్ కు ముందే బిచాణా ఎత్తివేయడం మేలని భావిస్తున్నారని అంటున్నారు.  

పిన్నెల్లి పోలీసులను తప్పించుకునేందుకు ఇల్లూ వాకిలీ వదిలేసి పారారైపోవడం వైసీపీ నేతలకు దారి చూపినట్లైంది. సరే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారనుకోండి అది వేరే విషయం. ఆ ముందస్తు బెయిలు కూడా జూన్ 5 వరకూ మాత్రమే లభించింది.  అది పక్కన పెడితే పిన్నెల్లి అండ చూసుకుని ఎన్నికల రోజు, ఆ తరువాత హింసాకాండతో చెలరేగిపోయి, రాడ్లు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసిన ఆయన అనుచరులంతా ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు.  

ఇక గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎంత మంది పరారీలో ఉన్నారో లెక్కేలేదు. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న వార్తలు వినవస్తున్నా.. జనం వాటిని పెద్దగా విశ్వసించడం లేదు. ఈబీ5 విసా సంపాదించి శాశ్వతంగా విదేశంలో సెటిల్ అయిపోయే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని నమ్ముతున్నారు.  అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి అరెస్టుపై అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ నుంచి ఒక వీడియో విడుదల చేశారు.  

పోలింగ్ తరువాత పుంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెన్నై పోర్టు ద్వారా తన కంపెనీకి సంబంధించిన పరికరాలు, యంత్రాలను ఆఫ్రికా పంపించేశారు. కౌంటింగ్ కు ముందే ఆయన కూడా ఆఫ్రికాకు పలాయనం చిత్తగించే అవకాశాలున్నాయన్న చర్చ పుంగనూరుగా జోరుగా సాగుతోంది.  

ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి విసయానికి వస్తే ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డిని దేశం దాటించడం ఎలా అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన అనుయాయులే చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు హింస నేపథ్యంలో మోహిత్ రెడ్డి మెడపై అరెస్టు కత్తి వేళాడుతోందని అంటున్నారు.