నివురు గప్పిన నిప్పులా ప‌ల్నాడు రాజ‌కీయం! ఫలితం తెలిసిపోయిందా?

వైసీపీ అరాచ‌కాల‌కు ప‌ల్నాడు ద‌ద్ద‌రిల్లిపోతోంది. నివురు గప్పిన నిప్పులా ప‌ల్నాడు రాజ‌కీయం అట్టుడుకుతోంది.  ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ లో పోలీసులు ఉన్నారు.  రాజకీయ నాయ‌కులు తమ ప్రయోజనాల కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు. తగలబడిన కార్లు, దగ్దమైన బైకులు, ధ్వంసమైన సామాన్లు.. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస మిగిల్చిన దృశ్యాలు ఎన్నిక‌ల సంఘానికి స‌వాల్‌ను విసురుతున్నాయి.

పేదరికం, పగలు, ప్రతీకారాలకు పల్నాడు గతంలో పేరుమోసినప్పటికీ, గడిచిన నాలుగు ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తక్కువే నమోదయ్యాయి. కానీ గత ఐదేళ్లుగా జ‌గ‌న్ సిఎం అయిన త‌రువాత‌ హింసాత్మక వాతావరణం పెరుగుతూ వస్తోంది.  పూర్వం పల్నాడులో  కత్తులు, నాటు బాంబులతో దాడులు చేసుకునేవారు.  ఫ్యాక్షన్ కలహాలుండేవి. ప్రత్యర్థుల మీద దాడులు, హత్యలు చాలా జరిగాయి. 

ఏడు హత్యల కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మాచర్ల నుంచి టీడీపీ తరుపున బరిలో ఉన్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.  

అలాగే కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలిన ఘటనలో ఆయన అనుచరులు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  కోడెల హయాంలో ప్రత్యర్థుల నోరు నొక్కారని, కోడెల కుటుంబం ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించిందనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి.  

అయితే 2019 ఎన్నికలతో దృశ్యం మారింది. ఆధిపత్యం చేతులు మారింది.  పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది.  ఏడు అసెంబ్లీ స్థానాలు (మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట), నరసరావుపేట పార్లమెంటును గెలుచుకుంది.  2019 ఎన్నికల సందర్భంగా కోడెలపై దాడి చేశారు. 

ఎన్నికల తర్వాత టీడీపీ కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడిని టీడీపీ కోల్పోయింది. అప్పటి నుంచి టీడీపీ కేడర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు పడటం లేదు. 2021 మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న మీద మాచర్లలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు.  ఇలాంటి అనేక ఘటనలతో పల్నాడు సమస్యాత్మక ప్రాంతంగా మారింది.  అసెంబ్లీ పోలింగ్ రోజున పల్నాడులో టీడీపీ క్యాడర్ హోరాహోరీగా పోరాడింది.  పోలింగ్ తర్వాత కూడా టీడీపీ క్యాడర్ గట్టిగానే నిల‌బ‌డింది.  వైసీపీ నేత‌లు చేస్తున్న అరాచ‌కాలు చూస్తుంటే ఓడి పోతామ‌న్న భ‌యంతోనే దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని స్థానికంగా జ‌నం మాట్లాడుకుంటున్నారు. 

ఏపీలో ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చెల‌రేగిన హింస‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. దీనిలో కీల‌క‌మైన అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన జిల్లాలు, న‌గ‌రాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. క‌ర‌డుగ‌ట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. అదే విధంగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్‌(అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతం)లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగో ద‌శ‌లో జ‌రిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల‌ను అత్యంత స‌మస్యాత్మ‌క కేంద్రాలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

అయితే.. అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోద‌శ పోలింగ్ త‌ర్వాత‌.. ఇంత హింస చెల‌రేగింది? అనేది జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప‌ల్నాడు ప్రాంతంలోని మూడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో(మాచ‌ర్ల‌, పెద‌కూర‌పాడు, స‌త్తెన‌పల్లి) ఎందుకు విధ్వంసాలు జ‌రుగుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యం జాతీయ స్థాయిలోనూ చ‌ర్చించుకుంటున్నారు.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

Online Jyotish
Tone Academy
KidsOne Telugu