నాలుగు పోయి నాలుగొచ్చింది.. గుర్తుందా సీఎం సారూ..

నవంబర్ 4 వెళ్ళిపోయింది. డిసెంబర్ 4 వచ్చేసింది. కానీ, దళిత బంధు గొంగళి మాత్రం  ఎక్కడవేసింది అక్కడే, ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోడ్ కారణంగా ఎక్కడ ఆగిపోయిందో, అక్కడే నిలిచి పోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ‘ఆన్ గోయింగ్ స్కీమ్’ పై అంక్షలేంటి అటూ ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కుట్రలుచేసి దళితులను మోసం చేస్తున్నాయని, విపక్షాలపైనా విరుచుకు పడ్డారు. అయినా, ఎన్ని కుట్రలు చేసినా ఎంతకాలం ఆపుతారు? అక్టోబర్ 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2 న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు అయిపోతుంది. గెల్లు శ్రీను గెలుస్తారు.  నాల్గవ తేదీతో కోడ్ ‘వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఎవరూ ఆపలేరు. నవంబర్ 4 నేనే హుజూరాబాద్ వచ్చి కుర్చుంటా.. మిగిలిన నియోజక వర్గాలకు ఒక ఆదర్శంగా నిలిచేలా పథకం అమలుచేస్తాము..అంటూ తెరాస ప్లేనరీ వేదిక నుంఛి ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే, అక్టోబర్ 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. రెండవ తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. గెల్లు గెలవ లేదు, ఈటల గెలిచారు.ఆ ఒక్క విషయంలో ముఖ్యమంత్రి లెక్క తప్పినా, ముఖ్యమంత్రి చెప్పింట్లుగానే 4 కోడ్ వెళ్ళిపోయింది. కానీ, మళ్ళీ మరో 4 తేదీ వచ్చినా, ముఖ్యమంత్రి హుజూరాబాద్ వెళ్ళలేదు. దళిత బంధు చెక్కులు పంచలేదు. అంతే కాదు, ముఖ్యమంత్రి ఈ నెలరోజుల్లో ఒక్క సారంటే, ఒక్కసారి,ఒక్క ముక్కంటే ఒక్క ముక్క దళిత బంధు గురించి మాట్లాడలేదు. ఈ  నెల రోజుల కాలంలో గంటల గంటలు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించారు. రాబోయే వేసంగిలో కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొంటుందా లేదా అనే విషయంలో తాడో పేడో  తేల్చుకునేందుకు హైదరాబాద్’లో ఆందోళన చేశారు .. యుద్ధానికి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇంకా  చాలా విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు. అయినా, దళిత బంధు అనే మాట మాత్రం ముఖ్యమంత్రి నోటి నుంచి రాలేదు. ముఖ్యమంత్రే కాదు, అదేదో నిషేధిత పదమా  అన్నట్లుగా అధికార పార్టీ నాయకులూ ఎవరూ కూడా దలిత్ బందు ప్రస్తావన చేయలేదు. 

అందుకే, దళిత బంధు కూడా, దళిత ముఖ్యమంత్రి ,మూడు ఎకరాలు, అంబేద్కర్ విగ్రహం, డబల్ బెడ్ రూమ్ జాబితాలో చేరిపోయిందని అనుకుంటున్నారు. మూడు ఎకరాల విషయంలో అసలు అలాంటి వాగ్దానమే ఏదీ చేయనేలేదని సెలవిచ్చిన విధంగా, ముఖ్యమంత్రి  ఎప్పుడో మరో మంచి ముహూర్తం చూసుకుని, దళిత బందా, అదేమిటి, ఆలాంటి హామీ ఇవ్వనే లేదు అని చెప్పగలరు. చెప్పి ఒప్పించనూ గలరు. దటీజ్ కేసీఆర్. మాటల గారడీలో కేసీఆర్’ ను కొట్టే వారు లేరు. మసిపూసి మారేడు కాయ చేయడం, తిమ్మిని బమ్మిని చేయడం, కేసీఆర్’కు కొట్టిన పిండి. అందుకే చెప్పేవి పచ్చి అబద్ధాలని తెలిసినా ఏ మాత్రం  తడుముకోకుండా ఆయన చెప్పదల్చుకున్నది చెప్పేస్తారు. ఆ విషయంలో ఆయన  దిట్ట అనిపించుకున్నారు. 

అయితే,హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్  దళిత బందును ఆటకెక్కిస్తారని అందరూ అనుకున్నా, ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని అసలు పట్టించుకోక పోవడమే విచిత్రంగా ఉందని సామాన్య జనం విస్మయం వ్యక్త పరుస్తున్నారు. ఉప ఎన్నిక సమయంలో ఇదే విషయంపై ఎంతో రాద్ధాంతం చేసిన బీజేపీ అధ్యక్షుడు బడి సంజయ్, ఆ పార్టీ ఇతర నాయకులు అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ ఒక్కరూ కూడా దళిత బందు పేరిట మరో మారు, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించక పోవడం ఏమిటి? అని జనం ప్రశ్నిస్తున్నారు.అలాగే, మీడియా కూడా దళిత బంధు గురించి ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రశ్నించక పోవడం.. ఏమిటి ? దళితులను దగా చేయడంలో అంతా ఒకటయ్యారా .. అంటే .. కాదనే పరిస్థితి కనిపించడం లేదు.