ఇంతకీ ఇప్పాల ఎక్కడ.. సిస్కో పక్కన పెట్టేసిందా? పంపించేసిందా?
posted on Mar 27, 2025 11:44AM

టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి శ్రీధన్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.
నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు.
ఒప్పందం విషయం పక్కన పెడితే.. తెలంగాణ సీఎం సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిన సమయంలో సిస్కో బృందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఎక్కడా కనిపించలేదు. సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేష్ ను కలిసిన బృందంలో కనిపించారు. అంతే కాదు మంత్రి లోకేష్ ముందు నిలిచి మాట్లాడారు. మామూలుగా అయితే ఈ విషయానికి ఏమంత ప్రాధాన్యత ఉండదు కానీ ఈ ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా అత్యంత అసహ్యంగా, జుగుప్సాకరంగా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన ఇప్పాల రవిచంద్రారెడ్డి పోస్టులపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.
అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో సభ్యుడిగా మంత్రి లోకేష్ తో భేటీ కావడం తెలుగుదేశం వర్గాలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరో, ఎలా ఉంటారో లోకేష్ కు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన పోస్టులు, ఆ పోస్టులలో వాడిన భాష కారణంగా తెలుగుదేశం నేతలు, శ్రేణులకు ఇప్పాలను గుర్తించడం పెద్ద కష్టం కాదు. లోకేష్ తో సిస్కో బృందం భేటీకి సంబంధించిన విజువల్స్ లో ఇప్పాల కనిపించడంతో తెలుగుదేశం శ్రేణులు భగ్గు మన్నాయి. దీంతో విషయం తెలిసిన లోకేష్ వెంటనే స్పందించారు. సిస్కోకు లేఖ రాశారు. రాజకీయాలకూ, వ్యాపార బంధాలకూ ముడిపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదని చెబుతూనే సుతిమెత్తగా ఇప్పాల నిర్వాకాలను ప్రస్తావిస్తూ అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భాగస్వామిని చేయవద్దని సూచించారు.
ఇది జరిగిన రెండు రోజులకు ఇదే సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయ్యింది. అయితే ఆ సందర్భంగా ఇప్పాలను మాత్రం దరి చేరనీయలేదు. కాగడా పెట్టి వెతికినా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిని సిస్కో బృందంలో ఇప్పాల రవిచంద్రారెడ్డి కనిపించలేదు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఇప్పాలను దూరం పెట్టాలని సిస్కోకు సూచిస్తే.. ఆ సంస్థ మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచే ఇప్పాలను తప్పించేసినట్లుందని పురిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సిస్కో ఇప్పాలను తప్పించేసిందా? తొలగించేసిందా? అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది.