రాజాసింగ్ ను పొగడ్తలతో ముంచెత్తిన బండి సంజయ్ మతలబేంటి?
posted on Apr 6, 2025 1:00PM

తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు. నేతలంతా మౌనంగానే ఉంటున్నారు. రాజాసింగ్ కు సంఘీభావంగా ఎవరూ నిలబడలేదు. అయినా కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్ వ్యాఖ్యలను తప్పు పట్టలేదు సరి కదా ఆయనకు సపోర్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజాసింగ్ గొప్ప దేశభక్తుడని హిందూ మతాన్ని పరిరక్షిస్తున్న నేత అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని విమర్శించిన రాజాసింగ్ ను పొగడ్తలతో ముంచెత్తడం వెనక మతలబేంటి అనే చర్చ ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ ను కేంద్ర నాయకత్వం గత ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. వరుసగా గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన రాజాసింగ్ హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే. అయినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనను సస్పెండ్ చేయడంతో పార్టీలో ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నడవలేదు. కనీసం ఆయనకు కలవడానికి కూడా ఇష్టపడలేదు. గత ఎన్నికల ముందు రాజాసింగ్ బర్తేడే వేడుకలు జరుపుకున్నప్పుడు ఏ ఒక్క నేత రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ రాజాసింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా రాజాసింగ్ బండి సంజయ్ వెంటే నిలిచారు. తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బిజెపి అభ్యర్థిగా గౌతం రాజును పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించగానే రాజాసింగ్ మండిపడ్డారు. మేకప్ మెన్ లు, టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పు పట్టకుండా పైగా పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో బండి సంజయ్ ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజాసింగ్ ను వెనక నుంచి ఎవరో ప్రోత్సహించడం వల్లే నేరుగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాజాసింగ్ కు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ కూడా బండి సంజయ్ ఇప్పించినట్లు ప్రచారంలో ఉంది. తాజా ఘటనలో కూడా పార్టీ అధిష్టానం రాజాసింగ్ పై చర్య తీసుకోకుండా బండి సంజయ్ అడ్డు గోడగా నిలుస్తున్నట్లు ప్రచారంలో ఉంది.