175 ఔటాఫ్ 175.. జగన్ ధీమా వెనుక ఆ రెండే..!
posted on Dec 21, 2022 10:56AM
175 అవుటాఫ్ 175 అంటూ ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపీ సీఎం జగన్ ది పగటి కల అనాలో, అతి విశ్వాసం అనాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సారి ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు 175 స్థానాలనూ మనమే గెలవాలి, ఆ అవకాశం మనకు మాత్రమే ఉంది.. అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులను ఊదరగొట్టేస్తున్నజగన్ అందుకోసం ఎమ్మెల్యేలకు నిర్దేశించిన కార్యాచరణ ఏదైనా ఉందంటే.. అది గడప గడపకూ మాత్రమే.
ఆ ఒక్క కార్యక్రమం మీరు ప్రజలెంత ఈసడించుకున్నా..వ్యితిరేకించినా, ముఖం మీదే తలుపులేసినా లెక్క చేయకుండా పూర్తి చేయండి. ప్రతి గడపకూ మీరు వెళ్లండి.. మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటున్నారు. అయితే గడపగడప కార్యక్రమానికి వస్తున్న స్పందనతో ఎమ్మెల్యే, మంత్రులు మాత్రం తమ ఇంటి గడప దాటడానికే జంకు తున్నారు. పొరపాటున ఎవరైనా వెళ్లినా మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ముఖం మీదే ఇంటి తలుపులు వేసేస్తున్నారు. మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం ప్రభుత్వ వ్యతిరేకతే కనిపిస్తున్నది. పాపం ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి తాము ఎదుర్కొంటున్ నిరసన గురించి చెప్పుకునే అవకావంకూడా లేదు. ఎందుకంటే 175 అవుటాఫ్ 175 గ్యారంటీ అన్న ధీమాతో ఉన్న జనగ్ చెప్పడమే తప్ప వినడమన్నది మానేసి చాలా కాలమైంది. పరిస్థితి చూసిన చాలా మంది వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలు పార్టీకి గండమేనని భావిస్తున్నారు. అంతర్గత సంభాషణల్లో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
ఇంతకీ ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. జగన్ గెలుపు ధీమాతో ఎలా ఉండగలుగుతున్నారు. ఆయన ధీమా వేనుక, ధైర్యం వెనుక ఉన్నదేమిటి? అంటే రెండే కారణాలు. ఔను ఎవరు ఔనన్నా మూడు రాజధానులు, బటన్ నొక్కి అమలు చేస్తున్న సంక్షేమం. వచ్చే ఎన్నికలలో ఈ రెండింటినే ఆయన తన గెలుపు మంత్రాలుగా నమ్ముతున్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నా.. జనం అమరావతే రాజధానిగా ఉండాలని నినదిస్తున్నా జగన్ లెక్క చేయకుండా మొండిగా మూడు రాజధానులంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సంక్షేమం పేర రాష్ట్రాన్నిఆర్థిక సంక్షోభంలో నెట్టేసి, ఉద్యోగులకు వేతనాలు సైతం సమయానికి ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఉచిత పథకాలను కొనసాగిస్తూ విజయం తథ్యమన్న కలల లోకంలో విహరిస్తున్నారు.
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరే విషయంలో వాలంటీర్లు, అతి చేస్తున్నా కూడా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక హేతు రహితంగా జగన్ సాగిస్తున్న సంక్షేమ రాజకీయం రాష్ట్రానికి చేస్తున్న చేటును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కరికి ఇంత లెక్కన అందరికీ డబ్బు పంచుతున్నాను.. ఓటెందుకు వేయరని తన పార్టీ నాయకులనే కాదు ప్రజలనూ దబాయిస్తున్నారు. ‘సంక్షేమమే’ వచ్చే ఎన్నికలలో గెలుపు తీరాలకి చేర్చుతుందని నమ్ముతున్నారు.
మూడు రాజధానులు.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు రాజధాని తెస్తా అంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసుకోవడం ద్వారా మూడు ప్రాంతాలలోనూ జనం తన వెనుకే ఉంటారన్నది జనగ్ భావనగా కనిపిస్తోంది. అయితే జగన్ మూడు రాజధానుల అస్త్రం బూమరాంగ్ అయిన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ రెంటి మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమౌతున్న జగన్ ను ఇవి రెండు..కేవలం ఇవి రెండూ మాత్రమే గట్టెక్కిస్తాయా? అంటే ఔనని తలూపడం కష్టం.