దిగ్విజయ్.. ట్రబుల్ షూట్ చేయగలరా?.. రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిన పెట్టగలరా?

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలో సీనియర్లమంటూ పెత్తనం చెలాయిస్తున్న వారే అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇంత కాలం పదవులు అనుభవించిన సీనియర్లు తరువాతి తరం నాయకత్వానికి స్వాగతం పలకడం లేదు సరికదా.. అడుగడుగునా అడ్డుపడుతున్నారు.

దీంతో సహజంగానే పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్యా గ్యాప్ బాగా పెరిగిపోయింది. పెరిగి పోయింది అనడం కంటే ఇరువురి మధ్యా  అగాధం ఏర్పడింది అని చెప్పవచ్చు. యువ నాయకత్వాన్ని స్వాగతించలేక పోవడంతోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని సంక్షోభానికి కారణం. యువనాయకత్వానికి వ్యతిరేకొంగా గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చుకు కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి నుంచి ఓటమి అన్నట్లు..దిన దినం దిగజారిపోతోంది.  రాష్ట్రంలో పార్టీ బలంగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నా.. పార్టీలో కుమ్ములాటలతో ప్రజలలో పార్టీ  చులకన అవుతోంది.  

తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత  పార్టీ ఒకింత పుంజుకుందన్న  మాట ఎవరూ కాదనలేరు. అయితే  అది ఎన్నికలో విజయం రూపంలో ఫలితం వచ్చేందుకు అవకాశం  లేకుండా పార్టీలో అంతర్గత విభేదాలు, రచ్చకెక్కి విమర్శలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందా అన్నట్లు తయారైంది. ఇక తాజాగా పీసీసీ కమిటీల నియామకం వ్యవహారంలో పార్టీ సీనియర్లు బహిరంగంగా రేవంత్ పై తిరుగు బావుటా ఎగురు వేశారు.

ఇందుకు ప్రతిగా రేవంత్ వర్గీయులు కూడా రాజీనామా ఆస్త్రాలు సంధించడంతో హై కమాండ్ రంగంలోకి దిగక తప్పని అనివార్యత ఏర్పడింది. అయితే పార్టీలో యువ రక్తాన్ని నింపాల్సిన అవసరం గురించి పదేపదే చెబుతూ వస్తున్న పార్టీ అధిష్ఠానం తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి మాత్రం వృద్ధ నేతనే పంపించింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అసంతృప్తిగానే ఉంది. అప్పటికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ వలనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పడంలో విఫలమయ్యామని పలు సందర్భాలలో వీహెచ్ వంటి నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడు పార్టీలో సంక్షోభ నివారణకు దిగ్గిరాజేనే హైకమాండ్ పంపడంతో ఆయన సీనియర్లను ఎంత వరకూ సముదాయించగలరన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా డిగ్గి రాజా ఇప్పటి వరకూ యువ నేతలకు ప్రోత్సాహం ఇచ్చిన దాఖలాలు లేవు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో యువ నేతలు తిరుగు బావుటా ఎగుర వేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అటు సీనియర్లకు, ఇటు జూనియర్లకూ సమ్మతం లేని దిగ్గిరాజాను అధిష్టానం దూతగా పంపడంతో ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దగలుగుతారా అన్నఅనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu