పదేళ్ల క్రితం మంగళూరులో ఇలాగే.. అసలీ టేబుల్‌టాప్ రన్‌వే ఏంటి?

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో నిన్న రాత్రి విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 737 విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్, కో పైలట్ సహా 20 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. 

 

సరిగ్గా పదేళ్ల క్రితం కర్నాటకలోని మంగళూరు విమానాశ్రయంలో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగింది. ఈ రెండు ప్రమాదాలకు కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. కోజికోడ్, మంగళూరు రెండూ టేబుల్‌టాప్‌ రన్‌వేలే. రెండు ప్రమాదాల్లోనూ విమానాలు బోయింగ్‌ 737 రకానికి చెందినవే. రెండు విమానాలూ వచ్చింది దుబాయ్‌ నుంచే.

2010 మే 22న దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం ఉదయం 6గంటల ప్రాంతంలో మంగళూరులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైలట్‌, కోపైలట్ సహా 158మంది ఆగ్నికి ఆహుతయ్యారు. కేవలం 8మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, అప్పట్లో ఇప్పుడున్నట్లు విపత్కర వాతావరణ పరిస్థితులు లేవు. విమానాన్ని దించడంలో పైలట్‌ చేసిన తప్పిదమే ఆ ఘోరానికి కారణమని తేలింది.

 

అయితే, ఈ ప్రమాదాలకు టేబుల్‌టాప్ రన్‌వేలే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. మన దేశంలో టేబుల్‌టాప్‌ రన్‌వేలు మూడే ఉన్నాయి. కర్నాటకలోని మంగళూరు, కేరళలోని కోజికోడ్‌, మిజోరాంలోని లెంగ్‌ప్యూ విమానాశ్రయాల్లో టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ టేబుల్‌టాప్ రన్‌వేను నిర్మిస్తారు. సాధారణ రన్‌వేల కంటే వీటి నిడివి చిన్నదిగా ఉంటుంది. పైలట్‌ కూడా ఈ రన్‌వేకు తగినట్లే విమానాన్ని దించాల్సి ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా అయోమయాన్ని కలిగిస్తాయి. పైలట్లు చిన్న తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు. 

 

టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాల్లో దిగడానికి అన్ని రకాల విమానాలూ అనుకూలం కాదు. షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ సాంకేతికత ఉన్న విమానాలే టేబుల్‌టాప్‌పై దిగగలవు. అందువల్లనే పలు విమానయాన సంస్థలు బోయింగ్‌ 737, ఎయిర్‌బర్‌ ఏ330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలున్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.