కన్నా రూటెటు?.. ప్రభావం ఏమిటి?

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీ నారాయణ మంత్రిగా కూడా సమర్థంగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు కాంగ్రెస్ లో ఎనలేని  ప్రధాన్యత ఉండేది. అయితే రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడంతో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ మృగ్యమని భావించి కమలం గూటికి చేరారు. ఇలా చేరారో లేదో అలా బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అందుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో బీజేపీ జోరు పెరిగిందని రాష్ట్ర కమలం శ్రేణులు ఇప్పటికీ చెబుతాయి.

అయితే అమరావతి విషయంలో ఆయన స్పీడు కారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి హైకమాండ్ కన్నాను తప్పించింది. అప్పటి నుంచీ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ కన్నా బీజేపీలోనే కొనసాగారు. తాజాగా బీజేపీపై పవన్ వ్యాఖ్యలతో కన్నా బరస్టయ్యారు. సోము వీర్రాజు కారణంగానే ఏపీలో బీజేపీ పరిస్థితి దిగజారిందనీ, ఆయన ఒంటెత్తు పోకడలతో పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా  ముఖ్య అనుచరులతో బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోనే కన్నా బీజేపీని వీడటం ఖాయమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ముఖ్య అనుచరులతో సమావేశం అవ్వడంతో ఆయన నేడో రేపో కమలం గూటి నుంచి బయటకు రావడం ఖాయమంటున్నారు. కమలం పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన ఏ పార్టీలో చేరనున్నారన్న విషయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సామాజిక వర్గ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఆయన జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని కొందరు చెబుతుంటే... అమరావతి విషయంలో ఆయన స్టాండ్ ను బట్టి చూస్తే ఆయన సైకిలెక్కడం ఖాయమని మరి కొందరు అంటున్నారు.

మొత్తం మీద ఆయన బీజేపీని వీడటం ఖాయమన్న విషయంలో మాత్రం ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించడం లేదు. అయితే ఆయన ‘సైకిల్’ ఎక్కుతారా, ‘గ్లాస్‘పట్టుకుంటారా?  అన్న విషయంపై మాత్రం హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.అయితే ఆయన ఏ గూటికి చేరినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేస్తారన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.

మొత్తం మీద కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడిగానూ కూడా కన్నా తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ తరువాత అమరావతి పోరాటంలో తెలుగుదేశంతో కలిసి నడిచారు. దీంతో ఆయన జనసేన వైపు కంటే తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ పెదకూరు పాడు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చినా.. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆయన దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు ఆయన పార్టీ మారడమంటూ జరిగితే ఆయన నరసరావు పేట లోక్ సభ స్థానం, అలాగే గుంటూరు2 లేదా సత్తెన పల్లి అసెంబ్లీ స్థానాలపై పట్టుబట్టే అవకాశం ఉందని కన్నా సన్నిహితులు చెబుతున్నారు.

తాను, తన కుటుంబం నుంచి మరొకరికి అవకాశంఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది.  ఒక వేళ తెలుగుదేశం పార్టీ వైపే ఆయన మొగ్గు చూపితే గుంటూరు2 నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదని అంటున్నారు. ఎందుకంటే..తెలుగుదేశం కూడా గుంటూరు 2 నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉందని తెలుగుదేశం వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద కన్నా బీజేపీపై వ్యక్తం చేసిన ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆయన పార్టీ మారడం అంటూ జరిగితే.. ఆ ప్రభావం బీజేపీ, వైసీపీలపై తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News