పిఠాపురంలో ఏం జరుగుతోంది?.. టీడీపీ శ్రేణులపై కేసుల సంకేతం ఏమిటి?

పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికలలో  పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు.  అయితే అప్పటి వరకూ ఆ నియోజకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అంతా భావించిన ఎస్పీఎస్ఎన్ వర్మ  చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా తప్పుకున్నారు. అంతే కాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. అయితే తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల క్యాడర్ మధ్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  నియోజకవర్గంలో వర్మకు ఉన్నపట్టు పలకుబడి జనసేన శ్రేణులలో భయాన్ని పెంచుతున్నది. వర్మ పట్టు పలుకుబడి వారిని భయపెడుతున్నది.  నియోజకవర్గంలో ఆయన అధికార కేంద్రంగా మారుతారన్న భయంతో జనసేన ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించింది. 

ఇక ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్య టించారు. ఆ సందర్భంగా జనసేన, తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయట పడ్డాయి. జనసేన తీరు ఏరు దాటాకా అన్న సమెతను తలపింప చేస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు పర్యటన సంద ర్భంగా వర్మకు ఆహ్వానం అందలేదు. నాగబాబు ఈ పర్యటనలో కొన్ని ప్రారంభోత్వాలలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున జరిగిన ఈ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందలేదు. దీనికి నిరసనగానా అన్నట్లుగా నాగబుబు పర్యటన ఆసాంతం తెలుగుదేశం కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా జనసేన కార్యకర్తలు జనసేన, పవన్ కల్యాణ్, నాగబాబు అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన రెండు రోజులూ పిఠాపురం దద్దరిల్లిపోయింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన ముగిసిన తరువాత.. తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదౌతున్నాయి. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఒక ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది. 
స్థానిక జనసేన నాయకుడుమొయిళ్ల నాగబాబు ఫిర్యాదుపై  తెలుగుదేశం కార్యకర్తలపై కేసు నమోదైంది.  తెలుగుదేశం కార్యకర్తలు తనను అడ్డుకుని తన మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారని మెయిల్ల నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదింది. ఇక ఇంకో కేసు  ఏఎస్ఐ జానీ బాష ఫిర్యాదు మేరకు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తన విధులకు ఆటంకం క లిగించారని ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.  
ఇక్కడ రెండు విషయాలను చెప్పుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పోలీసులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే పరిస్థితి జగన్ హయాంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎదుర్కొన్నారు.  దీనిని బట్టి చూస్తుంటే స్థానిక పోలీసులు జనసేన ఆదేశాలను అమలు చేస్తున్నారని భావించాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే పిఠాపురంపై దృష్టి పెట్టాలి. లేదంటే పిఠాపురం తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుని పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.  అాదే జరిగితే పిఠాపురంలో నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే కాదు జనసేనే కాదు. రెండు పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.  పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైనా సమానంగా ఉంటుంది. ఒంటి చేతి చప్పట్ల వళ్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని పరిశీలకులు అంటున్నారు.