వ్యాయామం మీద అతి పెద్ద పరిశోధన
posted on Nov 24, 2020 9:30AM
ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో కొత్తగా చెప్పేదేమీ లేదు. జాగింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం... ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇచ్చే వ్యాయామాలే అయినప్పటికీ... సులువుగా సహజంగా చేసే నడకే మన ఆరోగ్యాలను కాపాడుతూ వస్తోంది. కానీ ఈ నడక ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఇప్పటివరకూ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు.
రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదన్న మాట ఉన్నప్పటికీ... అదేమీ అంత శాస్త్రీయం కాదని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ 10,000 అడుగులు అన్నమాట జపాన్‌లోకి ఒక వాణిజ్య సంస్థ మొదలుపెట్టిన ప్రచారం అని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో వారానికి ఓ రెండు రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందిలే... మిగతా రోజుల్లో ఆఫీసుకి పోవాలి కదా! అంటున్నారు. మరి నడకకు సంబంధించి లోగుట్టును రట్టు చేసేదెలా!
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన ‘అలెన్ యూంగ్’ అనే కార్డియాలజిస్టుకి ఇదే అనుమానం వచ్చింది. వేలమంది జనాల రోజువారీ కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తే కనుక.... వారి జీవిత విధానం, అందులో భాగంగా వారు ఎంతసేపు నడుస్తున్నారు, ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు తెలిసిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం ఏమన్నా మెరుగుపడిందా! అన్న విషయమూ బయటపడుతుంది. కానీ ఇందుకోసం వేలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించడం ఎలా సాధ్యం?
తన పరిశోధనను ఎలా ముందుకు తీసుకుపోవాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్న అలెన్‌కు హఠాత్తుగా ఓ ఉపాయం తోచింది. అప్పటికే యాపిల్ సంస్థ విడుదల చేసిన ఒక యాప్ గుర్తుకువచ్చింది. మన శరీర కదలికలు ఎలా ఉన్నాయి? మనం ఎంత దూరం నడుస్తున్నాం? అని పసిగట్టగలిగే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమంటూ ఒక పిలుపుని ఇచ్చారు. అలెన్. అలెన్ పిలుపునిచ్చిన తొలివారంలోనే దాదాపు 53,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతానికి లక్షమంది ఈ యాప్ ద్వారా అలెన్‌కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అలెన్‌కు అందిస్తున్నారు. అందుకే వ్యాయామానికి సంబంధించి అతి పెద్ద పరిశోధనగా ఇది పేరుగాంచింది.
అలెన్ మొదలుపెట్టిన ఈ పరిశోధన ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందేందుకు కొంత కాలం పట్టక తప్పదు. లక్షమందికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించాలంటే అంత తేలికైన విషయం కాదు కదా! కానీ ఈపాటికే ఈ గణాంకాలు కాస్త భయపెట్టేవిగా ఉంటున్నాయట. మనలో చాలామంది అసలు కదలనే కదలడం లేదంటూ ఈ యాప్ ద్వారా తేలుతోందట.
‘అందులో ఆశ్చర్యం ఏముంది? మన సమయాన్ని పూర్తిగా కూర్చునే గడిపేస్తున్నాం. అటూఇటూ వెళ్లడం మాట అటుంచి, కనీసం లేచి నిలబడేందుకు కూడా ప్రయత్నించడం లేదు’ అంటున్నారు అలెన్. మరి ఈ పరిశోధన ముగిసేసరికి ఇలాంటి భయంకరమైన వాస్తవాలు ఎన్ని బయటపడతాయో!
మరైతే ఎంతసేపు నడవాలి? ఎలా నడవాలి? అన్న విషయమై అలెన్ తన పరిశోధనని పూర్తి చేసేదాకా మనం ఆగాలా! అమెరికాలోనే సుదీర్ఘ కాలం నడక గురించి అధ్యయనం చేస్తున్న ‘ట్యూడర్ లాక్’ అనే నిపుణుడి ప్రకారం మనషి రోజుకి కనీసం 8,000 అడుగులన్నా నడిస్తే మంచిది.
సాధారణంగా మనిషి ఓ 5,000 అడుగుల వరకు తనకు తెలియకుండానే నడుస్తుంటాడనీ, దానికి మరో 3,000 అడుగులు జోడించేందుకు, ఓ అరగంటపాటు ప్రత్యేకంగా నడకసాగించమని చెబుతున్నారు ట్యూడర్. మరి అలెన్ పరిశోధన, ట్యూడర్ మాటను ఎంతవరకు రుజువు చేస్తుందో చూడాలి.
- నిర్జర.