ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య వార్...
posted on Feb 10, 2020 11:40AM
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ చర్యను ఎదుర్కోవడానికి చట్ట పరంగా ముందుకు వెళతానని వెంకటేశ్వర రావు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాక రేపుతోంది.
ప్రభుత్వం తప్పుచేసి ఆ తప్పుకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అని చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురాను పరాకాష్టకు చేరుతుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదన్నారు. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించబోమనటం వైసీపీ ఉన్మాదానికి నిదర్శనం అని, అధికారులను భయబ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అటు టిడిపి సీనియర్ నేతలు యనమల, వర్ల రామయ్యలు కూడా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదించవద్దని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గాలను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏ తప్పూ చేయకున్నా ఏడు నెలలుగా పోలీసులను వీఆర్ లో ఉంచారని మూడు నెలలు విఆర్ లో ఉంటే జీతాలు ఇవ్వబోమని వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఓడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని సన్మానిస్తారు అనుకుంటే సస్పెండ్ చేశారు ఏమిటి అంటూ ట్వీట్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి వైసిపి గెలవటానికి టిడిపి ఓడిపోవడానికి ఏబీ వెంకటేశ్వరరావే కారణం అని అర్థం వచ్చేలా కేశినేని నాని ట్వీట్ చేశారు. కేశినేని నాని ట్వీట్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏబివి అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారు అని సజ్జల ట్వీట్ చేశారు. ఏబివి ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని వైసీపీని దెబ్బ తీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని ఆరోపించారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పని చేశారని తనతో సహా వైసీపీ నేతల ఫోన్లన్నింటిని అక్రమంగా ట్యాప్ చేసి ఓ మాఫియా నడిపారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు.
సస్పెన్షన్ పై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. బంధుమిత్రులను హితులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. ఆరోపణలు అవాస్తవమని సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్ట పరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని ఏబీ వెంకటేశ్వర రావు ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. ప్రాథమిక విచారణలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించినట్టుగా గుర్తించిన ప్రభుత్వం దీనిపై సీఐడీ చేత విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. అంతర్గత పరికరాలతో పాటు కొనుగోళ్ళ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తుకు సన్నాహాలు చేస్తోంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలనే ప్లాన్ లో ఉంది, ఇప్పటికే ఏడు అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్.