పాలమూరు డిసిసిబి ఛైర్మన్ పదవి రేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే!!
posted on Feb 10, 2020 11:57AM
పాలమూరు జిల్లాలో సహకార రాజకీయం రసవత్తరంగా మారింది. డీసీసీబి చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ లో రేస్ మొదలైంది. కుర్చీ దక్కించుకోవడానికి అన్ని స్థాయిల్లోని నేతలు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. హైకమాండ్ ప్రసన్నం చేసుకోడానికి ఆశావహులంతా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నేతలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార ఎన్నికల సమరం మొదలైంది. జిల్లాలో పీఏసీఎస్ లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. డిసిసిబి పై జెండా ఎగరేసేందుకు గులాబీ పార్టీ తహతహలాడుతోంది. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ లు లాబీయింగ్ మొదలుపెట్టారు. చోటా మోటా లీడర్ లు సైతం తమదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ లు, మునిసిపల్ చైర్మన్ లుగా అవకాశాలు రాని నాయకులు డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సహకార ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.
నిజానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి సహకార శాఖలో చాలా కీలకమైంది. ఈ పదవి పాలమూరులో ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల విభజన జరిగినా డిసిసిబి మాత్రం పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతోంది. ఫలితంగా ఈ పదవికి ప్రాధాన్యం గతంలో కంటే కూడా పెరిగింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజక వర్గాల్లో ఎనభై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇక్కడ డిసిసిబి పదవికి తీవ్ర పోటీ నెలకొంది, పదవి ప్రాధాన్యత దృష్ట్యా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తినే ఈ చైర్మన్ పదవికి ఎంపిక చెయ్యాలని అధిష్టానం భావిస్తోంది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు కేటీఆర్ ఆశీస్సుల కోసం హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు.
ఇక పాలమూరు డీసీసీబీ అధ్యక్ష పదవికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన హుస్నాబాద్ పీఏసీఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే గుర్నాథరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన కూడా డీసీసీబీ చైర్మన్ పదవిపైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలుకు చెందిన టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్క రఘునందన్ రెడ్డి కూడా డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ వద్ద ఈయన లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు జూపల్లి భాస్కరరావు, కొల్లాపురి నియోజకవర్గానికి చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబునగర్ నియోజవర్గం నుంచి కొరమాని వెంకటయ్య, బాలనగర్ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డిలు డిసిసిబి చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పాలమూరు డిసిసిబి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది మాత్రం ఇప్పటికైతే అంతుబట్టడం లేదు.