వైసీపీకి విశాఖ జిల్లా అధ్యక్షుడి రాజీనామా.. పార్టీలో గౌరవం దక్కకేనని వివరణ

జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.   పార్టీ నాయ‌కుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య  కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణంగా  అధికార ప‌క్షానికి విప‌క్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, స‌మ‌స్య‌లూ ఉంటాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీలో మాత్రం వ్య‌వ‌హారం రివర్స్ లో  ఉంది.  పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు  రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు.

ఇంటి గుట్టు ఇంటి వారే బ‌య‌ట‌ ప‌డేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్య‌వ‌హారా లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇప్పటికే  నెల్లూరు జిల్లాలో  వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మాజీ మంత్రి బాలినేని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెడ్డి  వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి   రాజీనామా చేశారు. ఆయన పార్టీలోనే ఉన్నా అసమ్మతి సెగ మాత్రం పార్టీకి గట్టిగానే తగిలేలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకటి రెండు అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ వైసీపీలో అసమ్మతి రగులుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షపదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామా సందర్భంగా పార్టీలో  కనీస గౌరవం కరవవ్వడంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

 ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పిన పంచకర్ల కనీసం అధిష్ఠానం తన మాట వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడంతో తన మాట వినే అవకాశం లేనందునే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu