న్యాయ వ్యవస్థనే ఢీ కొడుతున్న వైసీపీ.. అది తప్పు అంటున్న టీడీపీ 

సాక్షాత్తు పార్లమెంట్‌లో న్యాయస్థానాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమరావతి భూములకు సంబంధించి ఏర్పాటైన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం పై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే రాజ్యసభలో ప్రసంగించారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు. అంతేకాకుండా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని న్యాయ వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా అయన డిమాండ్ చేశారు. తను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అయితే న్యాయస్థానాలు మాత్రం మీడియా నోరు నొక్కుతున్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మీడియాలో, సోషల్ మీడియాలో రాకుండా హైకోర్టు ఆదేశాలివ్వడమే.

 

అయితే న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ మీడియా గొంతు నొక్కిందని వైసీపీ నేతలు అంటున్నారని ఐతే వివేకా హత్య కేసులో విచారణ అంశాలు మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్న విషయం వారు మరిచిపోయారా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు జడ్జిలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని.. అలాగే కోర్టులను కూడా బ్లాక్‌మెయిల్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీనికోసం న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసైనా.. తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసిపి పై మండిపడ్డారు.