మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన పీఏ.. జగన్ కి కొత్త తలనొప్పి!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ ముహూర్తాన అవినీతి రహిత పాలన అందిస్తాం అన్నారో కానీ.. పాపం ఆయన సొంత పార్టీ నేతలు, మంత్రుల పీఏలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. ఆయనకు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ వ్యవస్థలో.. వాలంటీర్ల ఎంపిక కోసం కొందరు ఎమ్మెల్యేలు ఒక్కో పోస్ట్ కి రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా డిమాండ్ చేసారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పీఏ భీమేష్.. తప్పుడు లెటర్ హెడ్లు, ఫోర్జరీ సంతకాలతో  ఉద్యోగ బదిలీలు అంటూ లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ విషయమై.. టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాయి.

తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య.. ట్విట్టర్ వేదికగా మంత్రి బాలినేని పీఏ భీమేష్ వ్యవహారంపై జగన్ ని ప్రశ్నించారు. "ముఖ్యమంత్రి గారు! మంత్రి బాలినేని గారి PA భీమేష్. మంత్రి గారి పేరుతో ఎన్నో అవకతవకలకు, అవినీతికి పాల్పడి దొడ్డిదారిన ఉద్యోగాలు, బదిలీలు, ఫోర్జరీలుచేసి నట్లు లోకం కోడై కూస్తోంది. మంత్రి గారుPA మీద ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. కారణం? ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా?" అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు. అయితే పీఏ భీమేష్ వ్యవహారం, వర్ల రామయ్య ఆరోపణలపై బాలినేని శ్రీనివాస్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరి అవినీతి ఆరోపణలు వస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని చెప్పిన జగన్.. మంత్రి పీఏ వ్యవహారంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటారేమో చూడాలి.