తమిళనాడు విలవిల: రంగంలోకి దిగిన ఆర్మీ
posted on Dec 12, 2016 1:36PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వార్థా తుఫాను తాకిడికి తమిళనాడు అతలాకుతలం అవుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కుండపోత వర్షాలు, పెనుగాలులతో వందలాది వృక్షాలు నేలకూలాయి. ముఖ్యంగా రాజధాని చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. తుఫాను తీరాన్ని దాటడానికి ముందే నగరంలో బీభత్స వాతావరణం నెలకొంది.
ఇక తీరాన్ని తాకే సమయంలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ముందస్తు చర్యగా నగర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు సైతం నిలిచిపోయయి. చెన్నై రావలసిన విమానాలను బెంగళూరు, హైదరాబాద్‌ల వైపు మళ్లీస్తున్నారు. తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సేవలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.