ఏపీ, తమిళనాడులను వణికిస్తున్న వార్ధా

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులను వణికిస్తోంది. ఇది ఇప్పటికే రెండుసార్లు దిశ మార్చుకుని, పశ్చిమ నైరుతి దిశగా ముందుకు కదులుతోంది. తుఫాను ప్రభావంతో తీరం వెంటే ఆదివారం నుంచే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తుఫాను తీరం దాటే ఏపీ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దీని ప్రభావం అధికంగా ఉంది.

సోమవారం మధ్యాహ్నం వార్ధా తీరం దాటనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెన్నైలోని ఎన్నూరు, పట్టినపాక్కం, కాశిమేడు తదితర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. వార్థా తీరం దాటుతుండటంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, పన్నీర్ సెల్వంలు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. తుఫానును సమర్థంగా ఎదుర్కోవడం, ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.