నా వల్ల జయ ఎంతో బాధపడ్డారు-రజనీకాంత్
posted on Dec 12, 2016 9:47AM
జయలలితను తాను ఎంతో బాధపెట్టానన్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, చో రామస్వామిలకు సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో జయలలితకు ఘనంగా నివాళులర్పించిన రజనీ..ఆమెనుద్దేశించి మాట్లాడారు.. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
నాటి ఎన్నికల్లో జయలలిత తిరిగి గెలిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి..డీఎంకే-టీఎంసీ కూటమి ఘన విజయం సాధించింది. ఓటమి కారణంగా జయ చాలా బాధపడ్డారని..ఆమెకు వ్యతిరేకంగా నిలిచానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడుతోందని రజనీ అన్నారు. పురుషాధిక్య సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆ సవాళ్లే జయను సానపెట్టిన వజ్రంలా మార్చాయన్నారు. అలాగే నటుడు, రచయిత చో రామస్వామి సుధీర్ఘకాలంగా తనకు స్నేహితుడన్నారు.