వల్లభనేని వంశీ ఆటకట్టేనా?
posted on Apr 2, 2025 11:22AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి.. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ మారిన వల్లభనేని వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా వ్యవహరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్ మెంట్లతో చెలరేగిపోయారు. అయితే తన అక్రమాలు, ఆక్రమణలన్నికీ తెరముందు తన అనుంగు శిష్యుడిని పెట్టి తాను తెరవేనుక బాగోతం నడిపారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుంగు శిష్యుడు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగా ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు రంగాను మూడు రోజుల పోలీసుల కస్టడీని అనుమతిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఇక వంశీ గుట్టుమట్లన్నీ రట్టు అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేనిఅప్పట్లో తెలుగుదేశం ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో గన్నవరం తెలుగుదేశంపై దాడి విషయంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీ పేరు లేదు. ఆ కేసులో వల్లభనేని ప్రధాన అనుచరుడు రంగాను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. అయితే అప్పట్లో అధికారంలో వైసీపీ ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు విచారణ ముందుకు సాగడం మొదలైంది.
ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా చేర్చారు. అయితే తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా పరారీలో ఉన్నారు. ఇఖ కేసులో తనను చేర్చడంతో అసలు కేసే లేకుండా చేస్తే మంచిదని భావించిన వంశీ... ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ బెదరింపు వ్యవహారంలో వంశీ అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన రంగాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీకి ఇక ఈ కేసులో బయటపడటానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసు, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకి.. ఇక జగన్ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు సంబంధించి విషయాలన్నీ రంగా విచారణలొ వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్మకంతో ఉన్నారు.