మొండి ప్రేమికులను ఎదుర్కోవాలంటే.. (వాలెంటైన్స్ డే స్పెషల్)


 

ప్రేమంటే అదో అందమైన అనుభూతి. కానీ ఆ ఆలోచన కేవలం ఒక్కరికే ఉంటే! తన మనసుకి అనుగణంగా ప్రవర్తించమంటూ అవతలివారిని పీడిస్తుంటే... సినిమాల్లో అయితే హీరోలు పదే పదే విసిగించగానే, అమ్మాయిలు పడిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. ‘ఇడియట్’ అంటూ తిట్టిన అమ్మాయిలే వారికి లొంగిపోయినట్లు కథ నడిపించేస్తారు. కానీ అదే ప్రవర్తన కళ్ల ఎదుట కనిపిస్తే... అది ప్రేమ కాదు నరకాన్ని తలపిస్తుంది. చివరికి అది ఎటు దారి తీస్తుందో అని మనసు తల్లడిల్లిపోతుంది. అందుకనే కాస్త భద్రంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు అవసరం...

 

తాత్సారం వద్దు

ఎక్కడైనా బావే కానీ అని ఓ మోటు సామెత ఉంది. నిజజీవితంలో ఇది తప్పక గుర్తుంచుకోదగ్గదే! ఎదుటి మనిషి ప్రపోజ్ చేయగానే, కుండబద్దలు కొట్టినట్లు మనసులో మాట చెప్పేయడం ముఖ్యం. అంతేకాదు! ఒకరు మన వెంట పడుతున్న విషయం అందరికీ తెలిసినా, అది ఎటు దారి తీస్తుందో ఊహించే అవకాశం ఉన్నా... చూసీచూడనట్లు ఊరుకోవడం మంచిది కాదు!

 

పెద్దల దృష్టికి

ఒక వ్యక్తి వద్దన్నా వెంటపడుతుంటే, దాన్ని పెద్దలతో చర్చించడం చాలా అవసరం. అది ఉపాధ్యాయులైనా కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులైనా కావచ్చు.... వారికి విషయాన్ని వివరించి ఉంచాలి. పెద్దలతో చెబితే లేనిపోని గొడవలు అవుతాయేమో అన్నది కేవలం అపోహ మాత్రమే! అలాంటి సందర్భాలలో వారి సూచనలు చాలా ఉపయోగపడతాయి. కర్ర విరగకుండా, పాము చావకుండా... ఆకతాయిల తాకిడి నుంచి బయటపడేస్తాయి.

 

లక్ష్యం మీద ధ్యాస

కొంతమంది ఆకతాయిలను గమనిస్తున్న కొద్దీ, వారు చెలరేగిపోతుంటారు. వారి హడావుడిలో పడి మన చదువు కూడా దెబ్బతినిపోతుంది. లక్ష్యం మీద దృష్టి చూపించాల్సిన వయసులో, కెరీర్ను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదుగా! అందుకనే ఆకతాయిలకు ఎలాంటి ప్రాధాన్యతనీ ఇవ్వకండి. వారిపట్ల ఎప్పుడైతే మీకు ఆసక్తి లేదన్న సూచన అందిందో, వాళ్లు మరో దారి చూసుకుంటారు. చదువు తరవాతే ప్రేమ అనే నిశ్చయంతో ఉన్న అమ్మాయిల జోలికి చాలామంది పోరు.

 

స్నేహితులతో పంచుకోండి

మొండి రోమియో మిమ్మల్ని విసిగిస్తున్న విషయం స్నేహితులకి చెప్పండి. అవసరమైన సలహా ఇచ్చేందుకైనా, ఆపదలో కలసికట్టుగా నిలిచేందుకైనా వారి బాసట మీకు ఉపయోగపడుతుంది. సదరు ప్రేమికుడని ఓ కంట కనిపెట్టేందుకు కూడా ఈ జాగ్రత్త ఉపయోగపడుతుంది. అంతేకాదు! చాలామంది కుర్రకారు పైకి చూడటానికి గంభీరంగా ఉంటారు. కానీ ఎదురుగాలి వీస్తోందని తెలియగానే నిదానంగా జారుకుంటారు.


హద్దులు దాటితే

ప్రేమిస్తున్నానంటూ సాగే వేధింపులు హద్దు మీరితే జాగ్రత్తపడండి. పైశాచికమైన ప్రవర్తనతో విసిగిస్తాడనో, భౌతిక దాడులకు దిగుతాడనో అనుమానం వస్తే ధైర్యంగా ముందడుగు వేయండి. కాలేజ్ యాజమాన్యానికి చెప్పడం, కుర్రవాడి తల్లిదండ్రులతో నేరుగా విషయాన్ని చెప్పించడం, సామాజిక మాధ్యమాలలో మీ భయాన్ని పంచుకోవడం.... ఎక్కడా మీకు న్యాయం జరగదన్న అనుమానం ఉంటే నేరుగా మహిళా సంఘాలనో, పోలీసులనో ఆశ్రయించడం చేయాల్సిందే! పరిస్థితి చేయి దాటుతోందని అనిపిస్తే ఆత్మరక్షణ కోసం జాగ్రత్తపడాల్సిందే!

- నిర్జర.

Related Segment News