ఆరోగ్యంలో మన స్థానం- 143


పరీక్షలలో పిల్లవాడికి నూటికి 42 మార్కులు వస్తే వాడి చెవి పట్టుకుని మెలేస్తారు. అంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ నిలదీస్తారు. కానీ అస్తవ్యస్తమైన విధానాల పుణ్యమా అని మన దేశానికే 42 మార్కులు వస్తే ఎవరిని ప్రశ్నించగలం? ఆరోగ్య రంగంలో ఐక్యరాజ్యసమితి మన దేశానికి అందించిన మార్కులివి. ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలకు ఇలాంటి మార్కులను కేటాయించగా వాటిలో మన దేశం 143వ ర్యాంకుని పొందింది. ఆ ముచ్చట ఇదిగో...
అన్నింటిలో దిగదుడుపే!

 

ప్రపంచంలోని వేర్వేరు దేశాలలోని ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు ఐక్యరాజ్యసమితి కొన్ని అంశాలను ఎన్నుకొంది. మలేరియా నివారణ, ఐదేళ్లలోపు పసిపిల్లల మరణం, పరిశుభ్రత... ఇలా ఓ 33 అంశాలలో ప్రతి దేశానికీ కొన్ని మార్కులను కేటాయించింది. వాటిలో మనకు దక్కిన కొన్ని మార్కులివీ-

 

 

- మలేరియా నివారణలో వందకి గానూ మనకి కేటాయించిన మార్కులు పది! మన పక్కనే ఉన్న శ్రీలంక వంటి చిన్నదేశాలు కూడా మలేరియా మీద విజయం సాధించాయి. తమ దేశాలలో మలేరియా రూపురేఖలే లేకుండా తరిమికొట్టి వందకి వంద మార్కులు పొందాయి. కానీ మనం మాత్రం 2030 నాటికన్నా మలేరియాను తరిమికొట్టాలన్న ఆశతో ప్రస్తుతానికి మలేరియా దోమల్ని పెంచిపోషిస్తున్నాము.

 

- స్వచ్ఛ భారత్‌ గురించీ, మరుగుదొడ్ల నిర్మాణం గురించీ మన ప్రభుత్వాలు తెగ ఊదరగొడుతూ ఉండవచ్చుగాక. వీటి గురించి ప్రకటనలను గుప్పించేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉండవచ్చుగాక. కానీ పరిశుభ్రమైన పద్ధతులను పాటించడంలో మన దేశానికి దక్కిన మార్కులు ఎనిమిదంటే ఎనిమిది!

 

- మాతాశిశు సంక్షేమం గురించి దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. కానీ ఇప్పటికీ ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు అదుపులోకి రావడం లేదు. ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యానికీ భరోసా లేదు. అందుకే ఆయా రంగాలలో ఐరాస మనకు 39, 28 పాయింట్లను అందించింది. ఇంతేకాదు! వాయుకాలుష్యం, ఎయిడ్స్‌ వంటి సమస్యలను ఎదుర్కోవడంలోనూ మన సామర్థ్యం అంతంత మాత్రమే అని ఈ నివేదిక పేర్కొంటోంది.

 

సిరియాకంటే దారుణం

వివిధ రంగాలలో ఆయా దేశాల ఆరోగ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా వాటికి కొన్ని మార్కులను కేటాయించింది ఐరాస. వాటి ప్రకారం ఐస్‌ల్యాండ్ దేశం 85 మార్కులతో తొలి స్థానంలో నిలువగా... సింగపూర్‌, స్వీడన్‌, ఫిన్‌ల్యాండ్, ఇంగ్లండులు తరువాత స్థానాలను పొందాయి. అంతర్యుద్ధంతోనూ, తీవ్రవాదంతోనూ నలిగిపోతున్న సిరియా (117), ఇరాక్‌ (128) వంటి దేశాలకంటే కూడా మన దేశం దిగువన ఉండటం తప్పకుండా ఆలోచించాల్సిన అంశమే! పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి పొరుగు దేశాలు మనకంటే తక్కువ మార్కులను పొందడం మాత్రమే మన నేతలను

 

తృప్తిపరిచే అంశం!

మన దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన లేకపోవడం, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు బలమైన వ్యవస్థలు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు నిపుణులు. ఇదే వాతావరణం కొనసాగితే, వచ్చే ఏడాది మన ర్యాంకు మరింత దిగజారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! ఇంతకీ మోదీగారు ఈ ర్యాంకులను చూశారో లేదో!

 

- నిర్జర.