తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటుపై అడ్డంకులు తొలగినట్లేనా?

 

తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణా ప్రభుత్వం అందరూ సమ్మతించడంతో దాని ఏర్పాటుకి పెద్దగా ఇబ్బందేమీ ఉండబోదని అందరూ భావించారు. కానీ ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషను పడటం, దానిని విచారణకు చేప్పట్టిన హైకోర్టు విభజన చట్ట ప్రకారం ఆంధ్రాకు తప్ప తెలంగాణాకు కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయకూడదని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత హైకోర్టు నుండి వేరే చోటికి తరలి వెళ్లేందుకు నిరాకరించడం వంటి పరిణామాలతో తెలంగాణాకి ఇప్పట్లో హైకోర్టు ఏర్పాటవుతుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. ఇటీవల ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన డిల్లీలో జరిగిన సమావేశంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.యల్. దత్తుతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు.

 

ఆ సమావేశంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్. దత్తు సూచన మేరకు త్వరలోనే ఆంధ్రా, తెలంగాణాల ఉమ్మడి హైకోర్టును విభజనకు త్వరలోనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చేరు. ఆ హామీ ప్రకారం గచ్చి బౌలీలో తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న 7అంతస్తుల భవనాన్ని పరిశీలించేందుకు హైకోర్టు జడ్జీలను పంపించారు. దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంగల ఆ భవనాన్ని వారు పరిశీలించి హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతీ సేన్ గుప్తాకు తమ నివేదిక అందజేస్తారు. ఆయన కూడా దానిని ఆమోదించినట్లయితే వెంటనే ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ విభజన ప్రక్రియ అంతా ముగిసినట్లయితే, బహుశః మరొక రెండు నెలలో తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి.