వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కేసులో కొత్త ట్విస్ట్.. ఎమ్మెల్యే పోస్ట్ కి ఎసరు!!

 

వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్లిన తనను అడ్డుకున్న టీడీపీ నేతలు, కులం పేరుతో దూషించారనీ, వినాయకుడు మైలపడతాడని వ్యాఖ్యానించారని.. వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నలుగురు స్థానిక టీడీపీ నేతల మీద పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టుగా ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలే ఆమె ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి అంటున్నారు.

విషయం ఏమిటంటే..  తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులానికి చెందినవాడని ఎమ్మెల్యే శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. శ్రీదేవి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఎవరైనా దళితులు మతం మార్చుకుంటే చట్టప్రకారంగా వారికి సంక్రమించే రిజర్వేషన్లను కోల్పోతారు. దీని ప్రకారంగా చూస్తే ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అనర్హురాలు. దీంతో ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే టికెట్టు పొందడం మీద ఆమెపై ప్రతిపక్షం కోర్టులో పిటీషన్ దాఖలు చేయబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, క్రిష్టియన్ మతంలో వుండి అట్రాసిటీ కేసులు పెట్టడానికి కుదరదని కోర్టు తీర్పులు వున్నాయి. ఇప్పుడు ఆ కేసులు ఎదుర్కొంటున్న వారు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయనున్నారని తెలుస్తోంది. 

హిందూ మత సాంప్రదాయం ప్రకారం వర్ధంతి, చావులకు హాజరయ్యి నేరుగా వినాయక చవితి గట్రా పూజలు చేయరు. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి మాత్రం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యి అటునుంచి నేరుగా వినాయకుడి పూజలో పాల్గొనడానికి వచ్చారట. తమ మత సాంప్రదాయాలకు భిన్నంగా మా మనోభావాలను దెబ్బతీస్తూ పూజలో పాల్గొనవద్దని గ్రామస్తులు అడ్డుకున్నారట. అయితే ఎమ్మెల్యే మాత్రం తనని ఎస్సీ అవటం వల్లనే పూజలో పాల్గొననివ్వలేదని తప్పుడు కేసు పెట్టారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ క్రిస్టియన్ గా SC సీట్లో పోటీచేసే అర్హత ఉండదు, అట్రాసిటీ కేసులు పెట్టడానికి కుదరదు. దీనిబట్టి బట్టి చూస్తుంటే.. ఆమె పెట్టిన కేసు, ఆమె గెలిచిన ఎమ్మెల్యే సీటు రెండు పోయేలా ఉన్నాయి అంటున్నారు.