తిరుమల కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల విక్రయానికి టీటీడీ అనుమతి?
posted on Apr 8, 2025 11:23AM

తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఆఖరికి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. అయితే ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని గాజు వాటర్ బాటిళ్ల రూపంలో భక్తులను దోచుకుంటున్నారు వ్యాపారులు. గత వైసీపీ హయాంలో కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు ఆ నిషేధాన్ని కేవలం ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో మాత్రమే కఠినంగా అమలు చేశారు. అలా ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించి, వాటి స్థానంలో వైసీపీ నాయకులకు ప్రయోజనం చేకూరేలా గాజు వాటర్ బాటిళ్లను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ గాజు వాటర్ బాటిల్లను తయారు చేసే అనుమతులను అప్పట్లో వైసీపీ నేతల బినామీలకే ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అప్పటినుండి ఇప్పటివరకు తిరుమల కొండపై గాజు వాటర్ బాటిల్ల విక్రయం పేరుతో వైసీపీ నేతలు కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరొకరికి అవకాశం లేకుండా వైసిపి నేతలు వాటర్ బాటిల్ల పేరుతో ఒక పేద్దమాఫియానే నడుపుతున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి కొండపై ప్లాస్టిక్ వాడకం నిషేధం విషయంలో అప్పటి వైసీపీ సర్కార్ కు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. కేవలం ప్లాస్టిక్ బాటిళ్లనే కాకుండా, ప్లాస్టిక్ కవర్లు, బొమ్మలకు వేసే ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధించాలి. కానీ అలా చేయకుండా కేవలం తమ వారికి అంటే తమ పార్టీ నేతలకు ప్రయోజనం కలిగే విధంగా కేవలం వాటర్ బాటిళ్లపైనే నిషేధం విధించి, వాటి స్థానంలో గాజు బాటిళ్లను తీసుకువచ్చింది. ఈ గాజు నీళ్ల సీసాలతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజు సీసాల వినియోగం, వాటి ధరతో ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్సవాల సమ యంలో ఎడా పెడా ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగి స్తూనే నిబంధనల పేరుతో భక్తులపై భారం మోపడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌలభ్యం కోసం ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి ఇవ్వాలని టీటీడీ యోచిస్తున్నది . బిస్లరీ, కిన్లే, ఆక్వా ఫినా, టాటా ప్లస్, తదితర బ్రాండెడ్ సంస్థలకు వారు విక్రయించే మినరల్ వాటర్ బాటిళ్లకు అనుమతినిస్తూ, దాంతో పాటుగా కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏ సంస్థలైతే తాగి వాడి పడేసే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే బాటిల్స్ విక్రయ అనుమతులను కూడా మంజూరు చేయాలని షరతును విధించాలని భావిస్తున్నారు. ఈ క్రషింగ్ యంత్రాలను మెయింటెనెన్స్ కూడా సంబంధిత సంస్థలే చేపట్టేలా నిబంధనలు విధించాలని టీటీడీ భావిస్తోంది.