కేరళ, తమిళనాడు తీరాలకు ఉప్పెన ముప్పు
posted on Jan 15, 2025 8:31AM
కేరళ, తమిళనాడు తీరాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ వోషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్ సీవోఐఎస్) హెచ్చరించింది. అనూహ్యంగా సముద్రంలో రాకాసి అలలు విరుచుకుపడే ఈ పరిస్థితిని కల్లక్కడల్ అంటారు. అటువంటి ప్రమాదం కేరళ, తమిళనాడు తీరాలకు పొంచి ఉందని హెచ్చరించిన ఐఎన్ సీవోఐఎస్, ఈ హెచ్చరికలను ఉపసంహరించుకునేంత వరకూ ఎవరూ బీచ్ లకు వెళ్లవద్దనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ల రాదనీ హచ్చరించింది.
సముద్రంలో పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడే ముప్పు పొంచి ఉందనీ, ఈ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉదన్న ఐఎన్ సీవోఐఎస్ హెచ్చరికలతో తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు అప్పమత్తమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బుధవారం (జనవరి 15) రాత్రి ఉప్పెన విరుచుకుపడే అవకాశం ఉదన్న హెచ్చరికల నేపథ్యంలో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సమాయత్తమయ్యాయి.