ఇటు హైకోర్టు.. అటు పార్లమెంటు.. జగన్‌ను వెంటాడుతున్న రఘురామ..
posted on Dec 13, 2021 3:23PM
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో వాదనలు వాడివేడిగా జరిగాయి. బెయిల్ రద్దు నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేసింది సీబీఐ. అటు, విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ మరో పిటిషన్ వేశారు రఘురామ. ఆ రెండు కేసులకు కలిపి.. రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది సీబీఐ కోర్టు. అయినా, పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రఘురామ. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.