క్లింటన్, బుష్, ఒబామా ఇచ్చిన ‘ ఆ విందు ‘ ట్రంప్ ఎందుకు ఇవ్వలేదు?

భారత ప్రధాని మోదీ మరోసారి అమెరికా పర్యటనలో వున్నారు. మన మీడియా అంతా మోదీ, ట్రంప్ ల విందు మీదే మనసు పెట్టేసింది. కాని, అంతర్జాతీయ మీడియా మాత్రం వైట్ హౌజ్ లో జరగాల్సిన మరో విందుపైన దృష్టి పెట్టింది. ఇరవై ఏళ్లుగా ఈ సమయంలో తప్పక జరగాల్సిన ఆ విందుని ఈసారి ట్రంప్ ఏర్పాటు చేయలేదు. సరి కదా… అది ఎందుకు జరగటం లేదో కూడా వైట్ హౌజ్ వర్గాలు చెప్పలేదు! ఇంతకీ ట్రంప్ ఇవ్వని ఆ వివాదాస్పద విందు ఏంటో తెలుసా? వైట్ ఇఫ్తార్!

 

మన దగ్గర రాజకీయ నేతలు అధికారికంగా ఇఫ్తార్ విందులు రంజాన్ నెలలో ఇస్తూ వుంటారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారేమో అన్నంత విరివిగా, ఘనంగా ఇచ్చేస్తుంటారు. ఇఫ్తార్ విందుల్లో ముస్లిమ్ ల మీద ప్రేమకన్నా మన వారి ఓట్ల రాజకీయమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. హలీమ్ తింటూ, నెత్తిన టోపీ పెట్టుకుని అమాంతం ముస్లిమ్ గెటప్ లలోకి వచ్చేస్తారు మన లౌకిక వాద నాయకులు! ఇదంతా తప్పు పట్టాల్సిందేం కాకపోయినా… ఇఫ్తార్ విందులు ఇవ్వటం సింబాలిక్ గా మారిపోయింది. అదే సమయంలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు తమ హిందూత్వ సిగ్నల్స్ బలంగా పంపటానికి ఇఫ్తార్ విందులు ఇవ్వకుండా రివర్స్ రాజకీయం చేస్తుంటారు! అయితే, ఇలాంటి ఇఫ్తార్ పాలిటిక్స్ అమెరికాలో కూడా జరుగుతాయంటే నమ్మగలరా? అదీ వైట్ హౌజ్ అంతర్భాగంలో విందు రాజకీయాలు వుంటాయంటే ఆశ్చర్యంగా వుంది కదూ…

 

వైట్ హౌజ్ లో ప్రెసిడెంట్లు విందులు ఇవ్వటం అమెరికాలో మొదట్నుంచీ పరిపాటి. ఆ కోవలోకే వస్తుంది ప్రస్తుతం అమెరికాలో వున్న మన మోదీకి ట్రంప్ ఇస్తోన్న వర్కింగ్ డిన్నర్! కాని, ప్రతీ రంజాన్ నెలలో ఇచ్చే ఇఫ్తార్ విందు అన్నిటి కంటే కాస్త ప్రత్యేకం! అమెరికాలో మన దేశంలో మాదిరిగా ముస్లిమ్ ఓట్లు గణనీయంగా ఏం వుండవు. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్లు ఇచ్చే ఇఫ్తార్ విందులు మన దగ్గరిలా ఓట్ల రాజకీయం కోసం కాదు. వాళ్లకి అంతర్జాతీయంగా ముస్లిమ్ సమాజాన్ని మచ్చిక చేసుకోవటం ఎంతో అవసరం. అందుకే, గత రెండు దశాబ్దాలుగా క్లింటన్, బుష్, ఒబామా లాంటి వారు ప్రతీ ఏటా రంజాన్ విందు వైట్ హౌజ్ లో గ్రాండ్ గా ఇస్తున్నారు. ఇక బరాక్ హుస్సేన్ ఒబామా కాలంలో అయితే మరింత గొప్పగా , శ్రద్ధగా జరిగేవి ఇఫ్తార్ సంబరాలు!

 

అంతర్జాతీయంగా ముస్లిమ్ లు ఎంతో ద్వేషించే జార్జ్ బుష్ ఓ వైపు అఫ్గనిస్తాన్, ఇరాక్ ల మీద బాంబులు వేస్తూనే ఇఫ్తార్ ఇవ్వడం మాత్రం మానలేదు. లాడెన్ ను వెదికి చంపించిన ఒబామా కూడా ఇఫ్తార్ రాజకీయం పక్కన పెట్టలేదు. కాని, ట్రంప్ మాత్రం తన స్టైల్ కి తగ్గట్టుగా ఏళ్ల తరబడి సాగిన సంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు. ఈసారి రంజాన్ వచ్చింది, పోయింది… కాని, వైట్ హౌజ్ లో మాత్రం హలీమ్ ఘుమఘుమలు ఎక్కడా గుప్పుమనలేదు! సెక్యులర్ వాసనలు కూడా…