రజినీ… బీజేపికి ఇష్టం! బీజేపి నేత స్వామికి మాత్రం కోపం! ఎందుకు?

మంట, కారంపొడి, కత్తి… ఇలాంటివి చాలా డేంజర్! మనవే కదా అనుకుని వాట్ని ఎలాగంటే అలా హ్యాండిల్ చేస్తే మనల్ని కూడా ఖతమ్ చేస్తాయి. అచ్చంగా సుబ్రమణ్యం స్వామి కూడా అలాంటి వారే! ఆయనతో పెట్టుకుంటే ఇతర పార్టీల వారు ఎలాగూ మూడు  చెరువుల నీళ్లు తాగాల్సిందే. కాని, సుబ్బుతో పెట్టుకుంటే స్వంత పార్టీ వారికి కూడా చుక్కలు కనిపిస్తుంటాయి. ఆయన స్వభావం అలాంటిది! ఎవర్ని ఎప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తాడో తెలియదు. కాని, ఒక్కసారి కన్నేశాడా… అంతే సంగతులు!

 

సుబ్రమణ్యం స్వామి అంటే సాక్షాత్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కూడా హడలే. వాళ్లని కూడా జైలు దాకా తీసుకెళ్లి వెనక్కి తెచ్చిన మొండివాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్వామి పోరాటం ఇప్పటికీ సోనియా, రాహుల్ కి ఇబ్బందికరంగానే వుంది. వాళ్లు ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారంటే అందుకు ఈయనే కారణం! అటువంటి సుబ్రమణ్య స్వామి తాజాగా రజినీకాంత్ ని రఫ్ఫాడించాలని డిసైడ్ అయ్యాడు! ఇది నిజంగా అందరికంటే ఎక్కువగా బీజేపి అభిమానులకి పెద్ద షాక్!

 

రజినీకాంత్ ఒక ఆర్దిక నేరగాడు అనేశాడు స్వామి. అంతే కాదు, ఆయన పాలిటిక్స్ లో వస్తే డొంకంతా కదులుతుందని బెదిరించాడు కూడా! మరో మాటగా రజినీకాంత్ ఏమీ చదువుకోని నిరక్షరాస్యుడని ఆరోపణ చేశాడు. పాలిటిక్స్ పనికిరాడని తేల్చేశాడు. కాని, ఇదంతా ఒక బీజేపి నాయకుడిగా వుంటూ సుబ్రమణ్య స్వామి చేయటం ఆందోశనకర పరిణామం!

 

స్వామి పై ప్రత్యక్ష ఆందోళనలకి, పోరాటాలకి దిగవద్దని తలైవా తన అభిమానులకి ఆల్రెడీ చెప్పినట్టుగానే కనిపిస్తోంది. అందుకే, వారి విమర్శలన్నీ ట్విట్టర్ , ఫేస్బుక్ లకే పరిమితం అయ్యాయి. లేకుంటే రజినీపై నోరు పారేసుకున్నందుకు ఈపాటికి వందల మంది తమిళనాడు రోడ్లపైకి వచ్చేవారు. కాని, అలా జరగలేదు. రజినీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు రాజకీయాల విషయంలో. ఆయన స్వామి లాంటి వారి ఆరోపణలకి రెచ్చిపోతాడని అనుకోవటం మన మూర్ఖత్వమే!

 

తమిళనాడులో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తోన్న మోదీ, అమిత్ షా ద్వయం రజినీకాంత్ ని తమ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అనుకూలంగా వాడుకోవాలనుకుంటోంది! ఇది పైకి చెప్పకున్నా అందరికీ తెలిసిన పబ్లిక్ సీక్రెట్టే! కాని, మోదీ, అమిత్ షాల బీజేపిలోనే వున్న స్వామి మాత్రం రజినీని టార్గెట్ చేస్తున్నాడు. తన పార్టీకి తమిళనాడులో మేలు చేసే సూపర్ స్టార్ పై సుబ్బూకి ఎందుకు కోపం? ఆయనకు శశికళ వర్గంపై వున్న ప్రేమే అలా మాట్లాడిస్తోందని కొందరి అనుమానం!

 

స్వామి ఒకప్పుడు జయ, శశికళపై కేసు వేసి వార్ని జైల్లో పెట్టించాడు. చివరకు, ఇప్పుడు కూడా శశికళ అనుభవిస్తోన్న జైలు శిక్షకి ఆయనే కారకుడు. కాని, మోదీ, అమిత్ షాకి పెద్దగా సదుద్దేశం లేని శశికళ అంటే స్వామికి సాఫ్ట్ కార్నర్ వుంది. స్టాలిన్ కంటే ఆమె వేయి రెట్లు బెటర్ అని పబ్లిగ్గానే చెప్పాడు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు అప్పుడు కూడా స్వామి శశికళ వర్గానికే మద్దతు పలికాడు. ఇలా ఆయనే కేసు వేసి దోషిగా నిరూపించిన వార్ని ఆయనే వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడు రజీనీపై అక్కసు కూడా శశికళకు మద్దతుగానే భావించాలి!

 

భారత రాజకీయాల్లో సుబ్రమణ్యం స్వామి ఒక వింత పొలిటీషన్. ఆయన పోలింగ్ బూతుల్లో కన్నా ఎక్కువ కోర్టు బోనుల్లోనే పోరాడాడు. అందుకే ఆయన తమపై పోటీ చేస్తాడన్నా భయపడని నాయకులు కోర్టు నోటీసు పంపుతాడంటే బెదిరిపోతారు! ఇప్పుడు ఆ వంతు రజినీకి వచ్చింది. నిజంగా తలైవా ఆర్దిక నేరం చేశాడో లేదో గాని… స్వామి కోర్టుకు లాగితే సూపర్ స్టార్ కి సూపర్ ఇక్కట్లు తప్పవు. అలాగే, బీజేపికి కూడా తమిళనాడులో వచ్చే నాలుగూ ఓట్లు రాకపోవచ్చు! మోదీ, షా ఎలా సుబ్రమణ్య అస్త్రాన్ని రజినీపైకి వెళ్లకుండా దారి మళ్లిస్తారో చూడాలి…