హైదరాబాద్ మేయర్ సీటు మీద టీఆర్ఎస్ కన్ను

 

తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ నగరం మీద పట్టు అంతంతమాత్రంగానే వుంది. ఇక్కడ ఆ పార్టీకి ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తల బలం కూడా తక్కువే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థుల అండతో నెట్టుకొచ్చిన టీఆర్ఎస్‌కి రాజకీయంగా విద్యార్థుల మద్దతు వుండకపోవడంతో మరోరకంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా టీడీపీ మీద దృష్టిని కేంద్రీకరించిన టీఆర్ఎస్ ఆ పార్టీ నుంచి నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు కార్పొరేటర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించినట్టు, వారు అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా తక్కువ మంది వున్న వైసీపీ నాయకులు కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేనాటికి హైదరాబాద్‌లో తన బలాన్ని పూర్తి స్థాయిలో పెంచుకోవడానికి టీఆర్ఎస్ పథక రచన చేస్తున్నట్టు సమాచారం. వీలయితే ఈ మధ్యలోనే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలను కూడా టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu