ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలియక బయటకు రాని నేతలు!!

 

తెలంగాణ ఆర్టీసీ సమస్య ఇంకా కొలిక్కి రాకపోవడంతో నియోజకవర్గంలో పర్యటించడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ వ్యవహారంపై ప్రతి రోజూ రివ్యూ చేస్తున్నారు. కానీ కార్మికుల సమ్మె ముగింపునకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సొంత పార్టీ నేతలు సైతం అంచనా వేయలేని స్థితిలో ఉన్నారు. దీంతో కార్మికులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సమ్మె కాలంలో తమ నియోజకవర్గాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వాయిదాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోకి వెళితే కార్మికులు అడ్డుకుంటారని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. కార్మికుల పట్ల ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. 

సమ్మె మొదలైనప్పట్నుంచి ప్రభుత్వం కూడా ఆర్టీసీ విషయంపై తప్ప ఇతర అంశాల పై దృష్టి పెట్టడం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత చేజారుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగితే సమస్య జఠిలమవుతుందనే తమ అనుచరుల వద్ద ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద ఆర్టీసీ అంశంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఆర్టీసీ వ్యవహారానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనే వాదన అధికార పార్టీలో వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.