ఎంత అంద‌మో.. అంత భయానకం

జాబిల్లీ రావే పాల బువ్వ తేవే  అంటూ త‌ల్లి బిడ్డ‌కి అన్నం త‌నిపిస్తుంది. అచ్చం చంద‌మామే అంటూంది పెద్దామె త‌న మ‌న‌వ‌రాల్ని.. వెన్నెల్లో ఆడుతూ పాడుతూ.. అంటూ హీరోగారు. హీరోయిన్‌తో అనేక నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తుంటాడు.. అదంతా కాదు అస‌లు ఆకాశంలో చూడాల్సిన‌వి న‌క్ష‌త్రాల వింత‌లు, సూప‌ర్ మూన్ వంటి అపుడ‌పుడూ సంభ‌వించే వింత‌లు అని ఖ‌గోల‌శాస్త్ర‌వేత్త‌లు అంటూంటారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ ఇటీవ‌లి తుపానులు, భారీ వ‌ర్షాలు.. ఇవ‌న్నీ సూప‌ర్ మూన్ ప్ర‌భావ‌మే అని శాస్త్ర‌వేత్త‌లే అంటున్నారు. మ‌రి అంద‌ర‌మ‌యిన సూప‌ర్‌మూన్ మాన‌వాళికి ఇంత‌టి దారుణాన్ని ఎలా ఒడిగ‌ట్టింది?  గులాబీని చూసి ఆవేశ‌ప‌డితే ముళ్లు గుచ్చుకుంటాయి బ్రో! 

ఆకాశంలో అద్భుతాల‌న్నీ భీక‌ర ప‌రిస్థితుల‌నూ సృష్టిస్తాయన్న నిజం ఇటీవ‌ల అనుభ‌వంలోకి వ‌స్తేగాని పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే ఇలాంటివి సంఘ‌ట‌న‌ల మ‌ధ్య శ‌తాబ్దాల అంత‌రం ఉండ‌ట‌మే. అపు డపుడూ ఆస్ట్రాయిడ్స్ కూడా భ‌య‌పెడుతూంటాయి. ఆమ‌ధ్య ఒక‌టి భూమికి స‌మీపంలోకి వ‌చ్చి వెళిపో యింద‌న్న‌ది శాస్త్ర‌వేత్త‌ల‌కు శాస్త్ర‌ప‌ర‌మైన అంశ‌మే కావ‌చ్చుగానీ, మామూలు మ‌న‌లాటి వాళ్ల‌కి ప్రాణ భీతి క‌ల్పించింది. ఒక్క‌సారి ఉల్కాపాతం జ‌రిగితే భూమి ఏం కావాల‌న్న భ‌యం వెన్నులో ఒణుకు పుట్టిస్తుంది. 

చిత్ర‌మేమిటంటే.. ఈ అందాలు, భ‌యోత్పాతాల విష‌యాల‌న్నీ నాసా వారే క‌నుగొని భ‌యాన్ని బాగా ప్ర‌చా రం చేయ‌డం. వారి వ‌ద్ద వున్న అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మ‌రెవ్వ‌రికీ అంత‌గా అందుబాటు లో లేక పోవ‌డం, నిత్యం అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూండ‌డంతో అమెరికా శాస్త్ర‌వేత్త‌లే ప్ర‌పంచ మాన‌వాళిని ఆనంద‌ప‌రుస్తున్నారు, చిన్న‌పాటి హెచ్చ‌రిక‌తో మ‌రింత నిద్ర‌లేకుండానూ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎంతో శ‌క్తివంత‌మైన సౌర తుపాను భూమిని తాక‌బోతోంద‌ని నాసా ప్ర‌క‌టించింది. ఓర్నాయ‌నో.. అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తారాజువ్వ‌నో, గాలిప‌టాన్నో చూస్తున్న‌ట్టు చాలామంది ఆకాశం వంకే చూస్తున్నారు. అదేమ‌న్నా విజ‌యా స్టుడియోవారి చంద‌మామా.. చ‌క్క‌గా ఆనంద‌ప‌ర‌చ‌డానికి!

అయితే ఈ  సౌర తుపాను  ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలో మీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవ కాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.  

అయితే, అది భూవాతావ‌ర‌ణంలోకి ఎప్పుడు స‌రిగ్గా ప్ర‌వేశిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా ఇంకా ప్ర‌క‌టించ‌ లేదు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు  బాహ్య వాతావరణం వేడెక్కే  అవకాశముందని  శాస్త్రవేత్తలు వివ రించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు. మానవ ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.  మాన‌వాళికి మ‌రింత ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని కోరుకుందాం.