టాలీవుడ్ సైలెన్స్.. కారణమేంటో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు. అయితే సినీ పరిశ్రమలో దిగ్గజాలనదగ్గ ఎవరూ కూడా బాహాటంగా జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పన్నెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలీ, పోసాని వంటి కమేడియన్ల మధ్యవర్తిత్వంతో టికెట్ల విషయంలో జగన్ తో బార్గెయినింగ్ కు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఆ సందర్భంగా తెలుగుసినీ హీరోలకు ఒకింత అవమానం జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాలను పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా బాహాటంగా విమర్శించింది లేదు. 

అలాగే స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు తప్ప చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు. 

సరే అదలా ఉంచితే.. ఇటీవల మనమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో ఏపీ సీఎంపై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోలు, దర్శకులు ఎవరూ కూడా ఈ ఘటనపై  స్పందించలేదు. ఖండించలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

రాష్ట్రంలో  ఎన్నికలకు కేవలం నాలుగు వారాల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి (అఫ్ కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే అనుకోండి)పై దాడి జరిగితే సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం. అయితే  వైఎస్ జగన్ వ్యవహరించిన విధంగా తెలుగు ఇండస్ట్రీ పట్ల ఇంత కక్ష పూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరూ ఇంత వరకూ లేరనీ, అందుకే జగన్ కు సంబంధించిన మంచి, చెడ్డల విషయంలో పరిశ్రమ మౌనంగానే ఉంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా  టిక్కెట్ల ధరల పెంపు కోసం, బెనిఫిట్ షోల కోసం పరిశ్రమలో దిగ్గజ హీరోలు తన దగ్గరకు వచ్చి వేడుకునేలా చేసుకున్న జగన్ పట్ల ఇండస్ట్రీ లో ఓ విధమైన వ్యతిరేక భావన ఉందని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటనను ఖండిస్తూనో, మరోలాగానో స్పందించడం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడడమే బెటర్ అన్నట్లుగా ఇండ తెలుగు సినీ పరిశ్రమ వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు.  జగన్ పై దాడికి ఖండిచి ఆయనకు అనవసర మైలేజీ ఇవ్వడమెందుకన్నట్లుగా మౌనంగా ఉండిపోయారంటున్నారు.

జగన్ పార్టీలో ఉన్న అలీ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ టికెట్ కోసం గత ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అలీకి చివరకు జగన్ రిక్తహస్తమే చూపడంతో ఆయన పార్టీ వ్యవహారాలకు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు జగన్ విషయంలో స్పందించకపోవడం  వారు జగన్ పట్ల సానుకూలంగా లేరన్న సంకేతాలను పంపినట్లేనని అంటున్నారు.