మెగాస్టార్ ఆధ్వర్యంలో సి. సి. సి. మనకోసం
posted on Mar 28, 2020 3:29PM
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇందుకోసం చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. మనకోసం (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటైంది. ఈ సి. సి. సి. మనకోసం సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు, దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు.
మొదటగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. " కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న కలకలం మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సమయంలో మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవి తన ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు , నేను, ఎన్.శంకర్ , కల్యాణ్ , దాము కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయ్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.," అని వివరించారు. దీనికి నాందిగా మొదట చిరంజీవి కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25లక్షలు ఇలా విరాళాలు ప్రకటించారు. వీరే కాకుండా ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు.. కరోనా మహమ్మారి వల్ల పలు సమస్యలకు లోనవుతున్న సినీ కార్మికుల సంక్షేమమే ఈ సంస్థ ముఖ్య ఆశయమని భరద్వాజ పేర్కొన్నారు.