కోడి గుడ్డు గురించి నిజాలేంటో తెలుసుకోకుంటే నష్టపోతారు!

ఆహారం అందరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా పోషకాహారం తగినంత తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండచ్చు. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గుడ్లు ప్రధానమైనవి. గుడ్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ కారణంగా రోజుకు ఒక గుడ్డు తినడం మంచిదని వైద్యులు కూడా చెబుతారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుడ్డు తినాలి. కానీ గుడ్డు గురించి చాలామందికి అపోహలు కూడా ఉంటాయి. గుడ్డు గురించి కొన్ని అపోహలు.. వాస్తవాలు తెలుసుకుంటే.

గుడ్లు గుండె ఆరోగ్యానికి చెడ్డవి..

గుడ్లు గురించి ఉన్న చాలా సాధారణ అపోహలలో అవి గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయనేది ఒకటి. అధిక కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా గుండె ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. అయితే ఆశ్చర్యపోయే నిజం ఏమిటంటే.. , ఆహారంలో ఉండే  కొలెస్ట్రాల్ ఒకప్పుడు అందరూ ఉలనుకున్నట్టు  రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు కనుగొన్నాయి. గుడ్డు సొనలు LDL (చెడు), HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కొవ్వులను కలిగి ఉంటాయి. కాబట్టి గుడ్డు గుండె ఆరోగ్యానికి చేటు అనే విషయం అవాస్తవం.

వండిన గుడ్ల కంటే పచ్చి గుడ్లు ఎక్కువ పోషకమైనవి..

చాలా మంది ప్రజలు పచ్చి గుడ్లు చాలా మంచివని నమ్ముతారు. వాసన విషయంలో వేగటుగా ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడతారు.   పచ్చి గుడ్లలో ప్రోటీన్, విటమిన్ B12 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా ఉంటాయనే విషయం ప్రచారంలో ఉంది.  అయితే పచ్చి గుడ్లను తీసుకోవడం ప్రమాదకరం. పచ్చి గుడ్లు సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి, ఇది వాంతులు, విరేచనాలు, జ్వరానికి దారితీస్తుంది. గుడ్లను ఉడికించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అప్పుడు వాటిని సురక్షితంగా తినవచ్చు. కాబట్టి పచ్చిగుడ్లు మంచివి కాదు.

గుడ్డులోని తెల్లసొనలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..

గుడ్డులోని తెల్లసొన మాత్రమే పోషకమైనది, పచ్చసొనలో కొవ్వు మరియు కేలరీలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. చాలామంది గుడ్డులో పచ్చ సొనను తీసేసి తింటుంటారు. అయితే అదంతా  అందరూ తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే..  గుడ్డు పచ్చ సొనలో తెల్లసొనలో లేని అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, వీటిలో విటమిన్ A, D, E మరియు K ఉంటాయి. అదనంగా, గుడ్డు సొనలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.  పచ్చ సొన తింటే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. ఫలితంగా ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది.

గుడ్లు బరువు పెంచుతాయి…

కొంతమంది గుడ్లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నమ్ముతారు, నిజానికి గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. ఈ కారణంగా గుడ్లు బరువు నియంత్రించడంలో దోహదపడతాయి తప్ప బరువు పెరగడానికి దారి తీయవు. అంతేకాకుండా, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యకరమైనవి..

చాలా మంది తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యకరమైనవి అని అనుకుంటారు. అయితే, గుడ్డు పెంకు రంగు దాని పోషక విలువ లేదా నాణ్యతను ప్రభావితం చేయదు. గోధుమ తెలుపు గుడ్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏదైనా ఉందంటే అది గుడ్లు పెట్టే కోడి జాతిని బట్టి ఉంటుంది.  

మధుమేహం ఉన్నవారు గుడ్లు తినకూడదు

కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా మధుమేహం ఉన్నవారు గుడ్లు తినకూడదనేది మరొక అపోహ. అయితే, గుడ్లు మితంగా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా, గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఆకలిని కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడతాయి.

రోజూ గుడ్లు తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

రోజూ గుడ్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటు  క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనే వాదనకు ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి విరుద్ధంగా, గుడ్లు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. గుడ్లు తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని తేలింది.

                                      ◆నిశ్శబ్ద.