చలో అమలాపురం అన్న బీజేపీ నాయకులను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు
posted on Sep 18, 2020 10:11AM
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయంతో పాటు పలు ప్రార్ధనా ప్రదేశాలలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో బీజేపీ చలో అమలాపురం అని పిలుపునిచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమ్యారు. బీజేపీ నేతలు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లకుండా నిరోధించడానికి అర్ధరాత్రి నుంచే పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఐతే పోలీసుల కళ్లు గప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గత రాత్రి అమలాపురం చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని రాత్రంతా కారులోనే తిప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర సహాయమంత్రి హోదా కలిగిన తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలను హౌస్ అరెస్ట్ చేసారు. బీజేపీ చలో అమలాపురం పిలుపుతో బయట ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తారన్న అనుమానంతో స్థానిక వ్యాపారులు స్వచ్ఛందగా షాపులు మూసివేశారు.