ఏపీలో ఆలయ  భూములు మాయం! కబ్జాదారులెవరు జగన్ రెడ్డి? 

“దేవాలయాలను, దేవాలయ భూములను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయశాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. దేవాలయాలకు సంబందించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటాం. అంతే కాని,  దేవాలయాల భూములను  విక్రయించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం దేవాలయ భూములను  అన్యులకు  దారాదత్తం చేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఆక్రమణలు జరగకుండా పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో దేవాలయాలలో 40 వేల సీసీ కెమారాలను అమర్చడం జరిగింది.” కొద్ది రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస విలేకరుల సమావేశంలో ఇచ్చిన వివరణ ఇది. 

అయితే  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రాష్ట్రం  దేవుడికే రక్షణ లేకుండా పోయింది. అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాల ద్వంస రచన యధేచ్చగా సాగుతోంది. మరో వంక దేవుని ఆస్తులకు, దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వట్టిగా ఆరోపణలు చేయడం కాకుండా గట్టి ఆధారాలను చూపుతున్నాయి. అయినా ప్రభుత్వం, ఏవో సాకులు చూపి, అడ్డదారులలో దేవాలయాల భూములను అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. కొంతకాలం క్రితం,తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములను, ఇతర ఆస్తులను విక్రయించడానికి, బ్రహ్మాండ ప్రణాళికను సిద్దం చేసింది.  ఒక్క రాష్ట్రంలోనే కాకుండా, దేశం మొత్తం దేశంలో ఉన్న వందల వేల కోట్ల రూపాయల విలువచేసే  భూములు, ఇతర ఆస్తులను విక్రయించేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం తీసుకుంది.

అయితే  పాలకమండలి నిర్ణయంపై భక్తులతోపాటు పలు పార్టీల నాయకులు, సంఘాలు ఆందోళన చేపట్టాయి.  భక్తులు ఇచ్చిన ఆస్తులు ఎలా అమ్ముతారంటూ రాజకీయ పార్టీలు, ధార్మిక  సంస్థలు ధ్వజమెత్తాయి. పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెంకన్న స్వామికి భక్తులు సమర్పించిన కానుకలను  'నిరర్థక ఆస్తులు' గా పేర్కొనడం పై దుమారం చెలరేగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే'నని ధ్వజమెత్తారు. ఆస్తుల వేలం నిర్ణయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో , వివిధ రూపాల్లో ఉద్యమం జరిగింది. ఇక చేసేది లేక మొదటికే మోసం వస్తుందని గ్రహించి ప్రభుత్వం అప్పటికి వెనకడుగు వేసింది. టీటీడీ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. కానీ, అదను కోసం ఎదురు చూస్తోంది. 

ప్రభుత్వం తీరు ఇలా ఉంటే, గేదె చేనులో మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎక్కడ దేవుని భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి పోతున్నారని, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు  ఆరోపిస్తున్నాయి. విపక్షాల ఆరోపణలను నిజం చేస్తూ, మంత్రాలయంలో మూడు కోట్ల రూపాయల విలువైన ఆంజనేయస్వామి మాన్యంపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నేశారు. వంద మంది ఆ భూముల్లో బండలు పాతేశారు. సుమారు ఆరు ఎకరాలు ఆక్రమించేశారు. అంతే కాదు,తమ పార్టీ నాయకుల ఆదేశంతోనే భూములను అక్రమించుకున్నామని, గొప్పలు పోయారు. ఇక సింహాచలం భూముల వ్యవహారం అయితే చెప్పనే అక్కరలేదు, ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణల సమస్య దశాబ్ధాలుగా అపరిష్కృతంగానే ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ప్రచార అస్త్రంగా ఉపయోగపడుతోందే కానీ, దేవునికి న్యాయం జరగడం లేదు. సింహాచలం దేవస్థానానికి విజయనగరం రాజులు 14 వేల ఎకరాలను దానంగా ఇచ్చారు. అందులో సింహాచలం ఆలయం చుట్టూ ఉండే 500 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి.ఈ భూములపై కన్నేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, అనేక అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలున్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల భూములు పెద్ద ఎత్తున అక్రమణకు గురయ్యాయి. తాజాగా లెక్కల ప్రకారం, అధికారికంగానే  దాదాపు లక్ష ఎకరాల దేవాలయాల భూమి అన్యాక్రాంతమైంది. పక్కా లెక్కలు తీస్తే అంతకు ఇంకెన్ని రెట్ల భూమి అన్యాక్రాంతం అయిందో తెలుస్తుంది. అలాగే వ్యాపారాల కోసం లీజుకు, వ్యవసాయం కోసం కౌలుకి భూములను తీసుకున్న వారు సైతం గడువు ముగిసినా వాటిని తిరిగి అప్పగించడం లేదు. ఈ నేపధ్యంలో ఆలయాల వారిగా రికార్డులను సిద్ధం చేసి, ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి...ఆ భూములను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని వస్తామని,  సింహాచలంతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాదాయ భూముల వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాత రికార్డును రీప్లే చేసారు.అయితే ఈ క్రమబద్దీకరణ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా...., సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.దేవాలయాల భూములను క్రమబద్దీకరించడాన్ని పీఠాధిపతులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
"ఆలయ మాన్యాలను ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.అంతేకాని...భూములను క్రమబద్దీకరించడం సరైనది కాదు. దేవుడి భూములను పంచే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. ఉన్నత లక్ష్యాలతో దేవాలయాల మనుగడకు, భగవంతుడి కైంకర్యాలకు దానంగా ఇచ్చిన ఆస్తులను ఇతరులకు పంచే హక్కు ప్రభుత్వాలకు లేదు.దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. దేవస్థానాల భూములను ఆక్రమించిన వారే అనుభవించేలా క్రమబద్దీకరించడం...సరైన విధానం కాదు. ఇది దేవుడిని మోసం చేయడమే" అని చినజీయర్‌స్వామి అన్నారు.

 ఇటీవల మద్రాస్ హై కోర్టు దేవాలయ భూముల విషయంలో మరో సంచలన తీర్పు నిచ్చింది. దేవ్లయాల భూములను విక్రయించే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం అయినా దాతల అనుమతి లేకుండా దేవాలయాల భూములను ముట్టుకునే అధికారం ప్రభుత్వాలకు లేదని, ఆల్ చేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దేవాలయాల భూములు ఎప్పటికీ దేవాలయాల భూములే, దేవాలయ భూములుగానే ఉంటాయి. ప్రజోపయోగం పేరున దేవాలయాల భూములు  తీసుకోవడం, కుదరదు, అది చట్ట రీత్యా నేరం  అని మద్రాస్ హై కోర్టు, ష్టమైన తీర్పును ఇచ్చింది. నిజానికి, మద్రాస్ తీర్పు కంటే చాలా ఏళ్ల ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కూడా, ఇదే విధమైన తీర్పు నిచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటాయి అనేది, అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ఏపీలో ఉన్నది, మాములు ప్రభుత్వం కాదు,కొత్త దేవుని ప్రభుత్వం. కాబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం పొరుగు రాష్ట్రం హై కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విలువ ఇస్తుందని అనికోవడం, ఆశించడం జస్ట్ వృధా ప్రయాస. ఆ దేవదేవుడిదే దేవాలయ భూముల రక్షణ భారం.