తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు!!
posted on Aug 16, 2019 12:26PM
తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 242 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో.. ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరించాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ.. కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు ఈరోజు ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌తో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు భేటీ కానున్నాయి.