ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ.. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందే!!
posted on Sep 1, 2020 4:23PM
జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రుణాలపై ఆంక్షలు సరైందికాదన్న కేసీఆర్.. కేంద్రం ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు.
కరోనా కారణంగా ఆదాయం ఘోరంగా పడిపోయిందని.. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశాలు అభివృద్ధి చెందినట్టేనని.. బలమైన రాష్ట్రాలు ఉంటేనే దేశంకూడా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రం రుణం తీసుకుని రాష్ర్టాలకు పూర్తిగా పరిహారం ఇవ్వాలని, పరిహారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని కేసీఆర్ కోరారు. నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును సమర్థించిందని, మొట్టమొదలు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కచ్చితంగా నిబంధన ఉన్నా.. జీఎస్టీ పరిహారం చెల్లింపులో జాప్యం కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందేనని సీఎం కేసీఆర్ కోరారు.