తెలంగాణ ద్రోహి కేసీఆర్

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు ఘాటుగా విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 74 మంది రైతుల కుటుంబాలకు ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి నుంచి 50 వేల రూపాయల చొప్పున చెక్కును ఆదివారం నాడు ఆదిలాబాద్‌లో అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీద ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు బాధితుల కుటుంబాలతో కలసి ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని, ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా తక్షణం ప్రకటించాలని, ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటే పట్టించుకోని కేసీఆర్ తెలంగాణను రష్యాలా, సింగపూర్‌లా మారుస్తానని అనడం సరైన పద్ధితి కాదని విమర్శించారు.