పుట్టంరాజు కండ్రిగను తీర్చిదిద్దుతా: సచిన్

 

పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఆయన ఆదివారం నాడు పుట్టంరాజు కండ్రిగను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులతో సచిన్ మాట్లాడారు. పొగాకు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన గ్రామస్తులకు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలసి స్వచ్ఛ భారత్ సచిన్ ప్రమాణం చేశారు. పిల్లలు ఆరోగ్యం విషయంలో మహిళలు జాగ్రత్తగా మెలగాలన్నారు. తన భారతరత్న అవార్డును తన తల్లితోపాటు పుట్టంరాజు కండ్రిగ గ్రామంలోని తల్లులకు అంకితం చేస్తున్నానని సచిన్ చెప్పారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న జాయింట్ కలెక్టర్ రేఖారాణికి సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సచిన్‌కి రాష్ట్ర మంత్రి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.