తెర పైకి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఇంచుమించుగా 18 నెలలు అంటే సంవత్సరంన్నర కావస్తోంది. ద్వితీయ వార్షికోత్సవం దగ్గర పడుతోంది.కానీ, ఇంత వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కారాణాలు ఏమైనా, గతంలో అనేక మార్లు పెట్టిన మంత్రివర్గ విస్తరణ ముహూర్తాలు వచ్చి పోయాయే కానీ, ఏ ఒక్కటీ ముడి పడలేదు. ఎప్పటికప్పుడు, ఏదో కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. 

 రాజగోపాల రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి కొందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని, అసమ్మతిని బహిరంగంగా వ్యక్తపరిచిన సందర్భాలు కూడా లేక పోలేదు.అయినా, మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం మాత్రం రాలేదు. అయితే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మరోమారు మంత్రివర్గ విస్తరణ అంశం తెర మీదకు తెచ్చారు. ఈసారి ఖచ్చితమైన ముహూర్తాన్ని అయితే ప్రకటించలేదుకానీ, శనివారం (మే 17) నిజామాబాద్’లో జరిపిన మీడియా ముచ్చట్ల సందర్భంగా ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, అన్నారు.అదే సమయంలో, మంత్రివర్గ విస్తరణతో పోటీపడుతూ వస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీపీ) కార్యవర్గం సైతం ఖరారు అవుతుందని  పీసీసీ చీఫ్, పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తీపి కబురు చెప్పారు. 

అయితే, నిజంగా ఇది తీపి కబురేనా, ఈసారైనా ముహూర్తం ముడిపడుతుందా అంటే, కాంగ్రెస్ వర్గాలు అనుమానమే అంటున్నాయి. నిజానికి, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి. అనేక జిల్లాల్లో విబేధాలు కొట్లాటలు, కుమ్ములాటల వరకువరకు వెళుతున్నాయి. ఫలితంగా అసమ్మతి, అసంతృప్తి బజారు ఎక్కడం, చివరకు గాంధీ భవన్ ను తాకడంతో పీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గ విస్తరణ,మ, పీసీసీ ఖరారు అంశాలను తెర పైకి తెచ్చారని పార్టీ నాయకులు  అనుమానిస్తున్నారు. 

ముఖ్యంగా..  మహిళలకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల ఏకంగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. నిజానికి డైరెక్ట్ గా పీసీసీ చీఫ్ పైనే ఆమె ఆరోపణలు ఎక్కు పెట్టారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని పీసీసీ అధ్యక్షుడిపైనే ఆరోపణలు చేశారు. పదవుల కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలని, తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగడంతో పాటుగా, మహేష్ కుమార్ గౌడ్ సొంతానికి పదవులు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. నిజానికి.. బయట పడక పోయినా  కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశిస్తున్న చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అందుకే.. నాయకుల అసంతృప్తిని పసిగట్టినమహేష్ కుమార్ గౌడ్  దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. త్వరలోనే పీసీసీ పదవులతో పాటుగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రకటించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి..  మంత్రివర్గ విస్తరణ జరిగేదే ఉంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నడుమ, అధిష్టానం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగిన, సంక్రాంతి (ఏప్రిల్ 3) ముహుర్తానికే విస్తరణ జరిగేదని, అంటున్నారు. నిజానికి అప్పట్లో ముహూర్తం ఖరారు కావడమే కాకుండా.. మంత్రి పదవులు పొందే ఎమ్మెల్యేల పేర్లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. అయితే, సంక్రాంతి ముహూర్తం వచ్చింది. వెళ్ళింది.  కానీ..  మంత్రివర్గ విస్తరణ జరిగ లేదని కాంగ్రెస్  నాయకులే గుర్తు చేస్తున్నారు. 

అలాగే.. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని,మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం  కాబట్టి ఏఐసీసీ నిర్ణయించే వరకు ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా, అవి మురిగి పోతాయని  అప్పట్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఢిల్లీ పెద్దలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో  అప్పుడే జరుగుతుంది. అంతవరకు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సహా ఎవరు ఏమి చెప్పినా..  ఎన్ని ముహూర్తాలు పెట్టినా, సంపూర్ణంగా విశ్వసించ లేమని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu